Trinethram News : తేజేశ్వర్ హత్యకు ముందే విమాన టికెట్లు, నగదు సమకూర్చుకున్న నిందితులు తిరుమలరావు, ఐశ్వర్యకేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి.. గద్వాలకు చెందిన ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసు దర్యాప్తులో నివ్వెరపోయే విషయాలు వెలుగుచూస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం మేరకు… తేజేశ్వర్‌ను చంపిన తర్వాత తిరుమలరావు, ఐశ్వర్య కలిసి మొదట లద్దాఖ్ వెళ్లి.. అక్కడి నుంచి విదేశాలకు పారిపోయేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అందుకోసం రెండు విమాన టికెట్లు బుక్ చేసుకోవడంతోపాటు రూ.20 లక్షలు సమకూర్చుకున్నారు. అందులో నుంచే సుపారీ గ్యాంగ్‌కు రూ.2 లక్షలు ఇచ్చారు. ఈ నెల 17న తేజేశ్వర్‌ను హతమార్చిన తర్వాత మృతదేహాన్ని కర్నూలులోని ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌లో పూడ్చిపెట్టాలని అనుకున్నారు. పోలీసులకు దొరికిపోతామనే భయంతో పాణ్యం వైపు వెళ్లి అడవిలో పడేశారు. తేజేశ్వర్ చేతిపై అమ్మ అనే పచ్చబొట్టుతో మృతదేహాన్ని గుర్తుపట్టారు. హత్యోదంతం వెలుగులోకి రాకముందే విదేశాలకు పారిపోయేందుకు ప్రధాన నిందితులిద్దరూ పక్కా ప్రణాళిక వేసుకున్నారు. కానీ, తేజేశ్వర్ కనిపించకపోవడంతో ఆయన సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసి ఐశ్వర్యపై అనుమానం వ్యక్తం చేయడంతో ఆమెను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తిరుమలరావు ఒక్కడే పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
తిరుమలరావు మొదట తన భార్యను చంపేసి ఐశ్వర్యను పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఈలోగా తేజేశ్వర్‌తో ఐశ్వర్యకు పెళ్లికావడంతోపాటు అతను కర్నూలులో కాపురం పెట్టడానికి అంగీకరించకపోవడంతో అతన్ని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. తిరుమలరావు డబ్బులు సమకూర్చేందుకు ఓ బ్యాంకులో రుణం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన పనిచేసే బ్యాంకులోనూ అవకతవకలకు పాల్పడినట్లు ప్రచారం ఉంది. ఐశ్వర్య.. తిరుమలరావుతోపాటు మరికొందరితోనూ సంబంధాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆమె చదువుకున్నది పదో తరగతే అయినా సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటుందని చెబుతున్నారు. గద్వాల పోలీసులు తిరుమలరావు భార్యతోపాటు, ఆయన తండ్రి విశ్రాంత ఏఎస్సైని స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు ఠాణాకు వచ్చి కేసు విచారణపై ఆరా తీశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


