TRINETHRAM NEWS

జయలలిత ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి చెందుతాయి

బెంగుళూరు ప్రత్యేక కోర్టు ఆదేశాలు

ఎంత సంపాదించినా.. చివరకు తీసుకెళ్లేది ఏమీ లేదన్న విషయంతో పాటు.. మరణించిన తర్వాత కీర్తి ప్రతిష్ఠలు తప్పించి.. ఆస్తులు ఏమీ వెళ్లిపోయిన వ్యక్తి వెంట ఉండవన్న నిజం జయలలిత జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. అక్రమార్జన కేసులో దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నుంచి స్వాధీనం చేసుకున్న చరాస్తుల విషయంలో బెంగళూరు ప్రత్యేక కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు.. వజ్రాభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది.

ఆభరణాల్ని వేలం వేసే బదులు తమిళనాడు ప్రభుత్వానికి అప్పజెప్పాలని తాము నిర్ణయించినట్లుగా పేర్కొన్న ప్రత్యేక న్యాయస్థానం.. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ సెక్రటరీ హోదాలో ఉన్న అధికారి పోలీసులతో వచ్చి జయలలిత ఆభరణాల్ని స్వాధీనం చేసుకోవాలని పేర్కొంది. అదేసమయంలో కేసు విచారణ కోసం కర్ణాటక ప్రభుత్వం చేసిన రూ.5కోట్ల ఖర్చును చెల్లించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని ఆదేశించింది. జయలలిత ఫిక్సెడ్ డిపాజిట్ ఖాతా నుంచి ఈ మొత్తాన్ని చెల్లించాలని పేర్కొనటం గమనార్హం.

వివిధ పదవుల్లో ఉన్న జయలలిత మీద అక్రమార్జన కేసు 1996లో నమోదు కావటం తెలిసిందే. ఈ కేసును ప్రభావితం చేయకుండా ఉండటానికి వీలుగా కర్ణాటకకు బదిలీ చేశారు. సాక్ష్యాల రూపంలో 1996 చెన్నైలో ఆమె ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువుల్ని కర్ణాటకలోనే ఉంచారు.

వీటిపై విచారణ చేసిన సీబీఐ ప్రత్యేక కోర్టు.. జఫ్తుచేసిన విలువైన వస్తువులపై జయలలిత బంధువులకు ఎలాంటి హక్కు లేదని తేల్చింది. వీటిపై తమకు హక్కులు ఉన్నాయంటూ పిటిషన్ దాఖలు చేసిన మేనల్లుడు దీపక్.. మేనకోడలు దీప వేసిన పిటిషన్లను తోసిపుచ్చటం తెలిసిందే. తాజాగా ఆమె నగలను తమిళనాడు ప్రభుత్వానికి ఇచ్చేస్తూ తీర్పును ఇవ్వటం ద్వారా అర్థమయ్యేది ఒక్కటే.. నోరు కట్టుకొని.. సంపాదించే సంపాదన కాలంతో పాటు సంపాదించిన వారితో ఉండిపోదన్న విషయం స్పష్టమవుతుంది.

సంపాదించే సమయంలో విపరీతమైన ఆరాటం. అందుకోసం చేసే పోరాటాలు తర్వాతి కాలంలో వాటికి ఎవరెవరో సొంతదారులైనప్పుడు కలిగే ఫీలింగ్ ఎలా ఉంటుందన్న దానికి నిలువెత్తు రూపంగా అమ్మ ఉదంతాన్ని చెప్పాలి. తమిళనాడు రాష్ట్రానికి అమ్మగా దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలితకున్న పేరు ప్రఖ్యాతుల గురించి ఎంత చెప్పినా తక్కువే. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన ఆమె.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వేళలో అనారోగ్యం పాలై.. ఆసుపత్రిలో చేరి.. అక్కడే చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఆమె జీవితంలో ఉన్న సంచలనాలు ఒక ఎత్తు అయితే.. ఆమె మీద ఉన్న ఆరోపణల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.