Janasena’s Formation Day Celebrations : ప్రకృతి ఒడిలో ప్రగతి అడుగులు పాడేరు గిరిజన గ్రామాల్లో జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

Janasena : పాడేరు మార్చి 15, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు నియోజకవర్గంలోని మారుమూల గిరిజన గ్రామాల్లో ప్రకృతి సోయగాల మధ్య జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వినూత్నంగా నిర్వహించారు. భారీ వేదికలు, హోర్డింగులు లేకుండా గిరిపుత్రుల మధ్య సాదాసీదాగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొని గ్రామాల అభివృద్ధి పనులను పరిశీలించారు.
గిరిజనుల మధ్య జెండా ఆవిష్కరణ… పాడేరు పరిధిలోని ఓనూరు కూడలి వద్ద ఏర్పాటు చేసిన కొత్త జెండా స్థూపాన్ని ఆవిష్కరించి పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు.
అడవితల్లి బాటలో కాలినడక పర్యటన… ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు పీఎం జన్‌మన్ (అడవితల్లి బాట) పథకం కింద రూ.1.70 కోట్లతో నిర్మించిన 2.4 కిలోమీటర్ల బీటీ రహదారిని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాలినడకన పరిశీలించారు. మార్గమధ్యంలో నిర్మించిన కల్వర్టులు, రహదారి నాణ్యతను పరిశీలిస్తూ అధికారులను అభినందించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు.
జల్ జీవన్ మిషన్ పనుల పరిశీలన… ఓనూరు గ్రామంలొ జల్ జీవన్ మిషన్ పథకం కింద రూ.8.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలను పరిశీలించారు. బిందెతో నీటిని తీసి నీటి స్వచ్ఛతను పరిశీలించి, గ్రామస్తులకు సరిపడా నీరు అందుతున్నదా అని అడిగి తెలుసుకున్నారు.

పాఠశాలలు, అంగన్వాడీల తనిఖీ…. గ్రామంలోని అంగన్వాడీ కేంద్రం, మండల ప్రాథమిక పాఠశాలను సందర్శించి చిన్నారులకు స్వీట్లు, పౌష్టికాహార కిట్లు అందజేశారు. విద్యార్థులకు స్కూల్ బ్యాగులు, పుస్తకాలు మరియు ఇతర స్టేషనరీ కిట్లు పంపిణీ చేశారు. పాఠశాల భవనంలో దెబ్బతిన్న ఫ్లోరింగ్‌ను వెంటనే మరమ్మతు చేయాలని అధికారులకు ఆదేశించారు.
గిరిజన గ్రామాల అభివృద్ధిపై దృష్టి… కొత్తపొలం గ్రామస్తులు రోడ్డు, తాగునీరు, పాఠశాల భవనం కోసం వినతిపత్రం అందజేయగా, సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. గిరిజనుల ఆదాయం పెంచేందుకు రోడ్ల పక్కన పనస, సీతాఫలం మొక్కలు నాటాలని సూచించారు. అలాగే ఎకో టూరిజం అభివృద్ధి కోసం బ్యాంబూ కాటేజీలు, హోమ్ స్టేలు, ఫిల్మ్ షూటింగ్ స్పాట్ల అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
గిరిజనులతో మమేకం… నందిగరువు గ్రామానికి చెందిన మహిళలు తమ గ్రామానికి రోడ్డు నిర్మాణం చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయనతో కలిసి కాలినడకన గ్రామం వరకు నడిచారు. గ్రామస్థుల సమస్యలు వినుతూ పరిష్కారానికి హామీ ఇచ్చారు.
గ్రామాల పర్యటన కొనసాగింపు… పాడేరు సమీపంలోని వర్థనపల్లి గ్రామంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. మ్యాజిక్ డ్రెయిన్ల ఏర్పాటుపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు రచ్చబండ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. పర్యటన ముగిసిన అనంతరం పాడేరు శివారులోని శ్రీ లలిత త్రిపుర సుందరి టెంపుల్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి పనులను ప్రత్యక్షంగా పరిశీలిస్తూ ప్రజలతో మమేకమైన ఈ పర్యటన స్థానిక ప్రజల్లో విశేష స్పందనను కలిగించింది.

Janasena's 13th Formation Day Celebrations

You cannot copy content of this page

Scroll to Top