అల్లూరిజిల్లా అరకులోయ డిసెంబర్ 30, (త్రినేత్రం న్యూస్): గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, విద్యపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఐటిడిఎ ప్రాజెక్ట్ ఆఫీసర్ తిరుమణి శ్రీపూజా స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు.
స్థానిక ఐటిడిఎ సమావేశ మందిరంలో పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాలకు చెందిన ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు, ఏటిడబ్ల్యుఓలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
గిరిజన విద్యార్థుల ఆరోగ్యం, విద్య రెండింటినీ సమానంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను అక్షరాల అమలు చేయాలి, ముఖ్యంగా పదో తరగతి విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక శిక్షణ అందించాలని స్పష్టంగా పేర్కొన్నారు.
హాస్టల్ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ సిస్టం (హెచ్ పి టి ఎస్) యాప్ వినియోగంలో నిర్లక్ష్యం చేయరాదని, రోజువారీ కార్యకలాపాల నమోదు, విద్యార్థుల హాజరు, ఆరోగ్య వివరాలు తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలని ఆదేశించారు. ప్రతిరోజూ జరిగే కార్యక్రమాల ఫోటోలను తీసి నోటీస్ బోర్డులో ప్రదర్శించాలని స్పష్టం చేశారు.
మండల స్థాయిలో పనిచేసే అధికారులు తప్పనిసరిగా హెడ్‌క్వార్టర్స్‌లోనే నివసిస్తూ అందుబాటులో ఉండాలని, రాత్రి వేళల్లో సూపర్వైజింగ్ స్టడీ నిర్వహించాల్సిందేనని ఆదేశించారు. టీఆర్ఎస్, ఐవిఆర్‌ఎస్ కాల్స్ వచ్చినప్పుడు విద్యార్థుల తల్లిదండ్రులతో బాధ్యతాయుతంగా వ్యవహరించి, నెగెటివ్ భావన కలగకుండా పాజిటివ్‌గా వివరించాలని సూచించారు.
నిర్లక్ష్యం, అలసత్వం, పనితీరులో వెనుకబాటుకు ఎలాంటి మినహాయింపులు ఉండవని, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఈ సమావేశంలో గిరిజన సంక్షేమ శాఖ ఉపసంచాలకులు పి.బి.కె. పరిమిల, పాడేరు డివిజన్ పరిధిలోని 11 మండలాల హెచ్‌ఎంలు, డిప్యూటీ వార్డెన్లు, ఏటిడబ్ల్యుఓలు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


