జూన్ 27న పాడేరు ఐటీడీఏ వద్ద భారీ ధర్నాకు సిద్ధమవుతున్న గిరిజన సంఘం
అల్లూరుజిల్లా(అరకు లోయ) త్రినేత్రం న్యూస్ జూన్ 26: బొండం పంచాయతీ పీఎం జన్మన్ హౌసింగ్ రెండో విడత లబ్ధిదారులను శాంక్షన్ లిస్టులో చేర్చాలని గిరిజన సంఘం మండల శాఖ తీవ్రంగా డిమాండ్ చేస్తోంది. సాంకేతిక కారణాలను చూపుతూ సుమారు 70 మంది అర్హులైన లబ్ధిదారులను ప్రొపోజల్ లిస్టులో పెట్టడాన్ని వారు తప్పుపడుతున్నారు.
ఈ నెల 27న పాడేరు ఐటీడీఏ వద్ద జరగనున్న ధర్నా విజయవంతం కావాలని విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఈ మేరకు బొండం పంచాయతీ పరిధిలోని కొలియా గూడ, రంగిని గూడ, బలియా గూడ గ్రామాల్లో కరపత్రాలు పంపిణీ చేశారు. ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తుం బుజ్జి బాబు మాట్లాడుతూ – “బొండం పంచాయతీలో 258 ఇళ్లకు మంజూరు అయ్యాయి. వీటిలో సగం మంది లబ్ధిదారులకు లింటల్ లెవెల్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. పునాది దశ పూర్తయి నెలలవుతున్నా శాంక్షన్ లేక నిర్మాణం నిలిచిపోయింది,” అన్నారు.
అంతేకాక, గ్రామ సభ ఆమోదం పొందిన లబ్ధిదారుల వివరాలను అధికారులకు పంపినా వారు శాంక్షన్ జారీ చేయకుండా ప్రొపోజల్ లిస్టులో ఉంచడాన్ని గిరిజనులు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఆధార్, బ్యాంక్ అకౌంట్ లో చిన్న చిన్న లోపాల పేరుతో మేలు చేయకుండా నెలల తరబడి హౌసింగ్ ఆఫీసు చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు.
అరకువేలి మండలంలో మొత్తం ₹21.54 కోట్లు బకాయిలుగా ఉండగా, బొండంలోనే అధిక సంఖ్యలో లబ్ధిదారుల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. “బకాయిలు చెల్లించక ప్రజలు అప్పులు చేసి మెటీరియల్ కొనుగోలు చేశారు. నష్టపోతున్నారు,” అన్నారు బుజ్జి బాబు.
“హౌసింగ్ బిల్లులు మంజూరు కావాలంటే ముడుపులు అవసరమవుతున్నాయని లబ్ధిదారులు చెప్పుతున్నారు. దీనిపై జిల్లా స్థాయి అధికారులు పర్యవేక్షణ చేపట్టి అవినీతి రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలి,” అన్నారు. నిర్మాణ సామగ్రి ధరలు అధికంగా ఉన్నాయని, యూనిట్ కాస్ట్ పెంచి ఒక్కొక్క ఇంటికి రూ.10 లక్షలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ కళాకారుల సంఘం జిల్లా నాయకులు టి. జోషి, గిరిజన సంఘం మండల నాయకులు కె. బుజ్జిబాబు, పంచాయతీ ప్రతినిధులు ఎస్. రామస్వామి, కె. గోపాల్, ఎస్. చైతన్య, ఎస్. రాంబాబు, లబ్ధిదారులు ఎస్. సుమిత్ర, ఎస్. కల్యా, వి. అప్పలమ్మ, ఎస్. శాంతి తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


