త్రినేత్రం న్యూస్ : టీడబ్ల్యూజేఎఫ్ నేతల పరామర్శ రూ.35 వేలు ఆర్థిక సహాయం అందజేత హైదరాబాద్, అనారోగ్యంతో ఇటీవల మరణించిన సీనియర్ జర్నలిస్టు, గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ హౌసింగ్ సొసైటీ సభ్యుడు పెంటూకర్ శ్రీనివాస్ కుటుంబాన్ని సొసైటీ అధ్యక్షుడు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మామిడి సోమయ్య, ఉపాధ్యక్షుడు బండి విజయ్ కుమార్ లు మంగళవారం పరామర్శించారు. మల్కాజ్ గిరి లోని వారి ఇంటికి వెళ్లి శ్రీనివాస్ భార్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబాకి ఆర్ధిక సహాయం కింద మామిడి సోమయ్యతో పాటు సొసైటీ ఉపాధ్యక్షుడు పిల్లి రాంచందర్, కార్యదర్శి బొల్లం శ్రీనివాస్, పలువురు సొసైటీ సభ్యులు చేసిన 35 వేల రూపాయలను మామిడి సోమయ్య..
దివంగత శ్రీనివాస్ భార్య అర్పన కు అందజేశారు. దాదాపు పాతికేళ్ళుగా వివిధ పత్రికల్లో జర్నలిస్టుగా పని చేసిన శ్రీనివాస్ ఆర్థికంగా ఏ మాత్రం ఎదగక పోగా..పైగా ఒక పత్రిక నడిపేందుకు పెట్టుబడి కోసం, కుటుంబ పోషణ, పిల్లల చదువుల కోసం సొంతింటిని అమ్ముకోవడం బాధాకరమని మామిడి సోమయ్య అన్నారు. భార్య, ఉన్నత చదువులు చదువుకుంటున్న ఇద్దరు కూతుళ్ళుతో కలిసి పదహారేండ్లుగా కిరాయి ఇంట్లో ఉంటున్నారని తెలిపారు. జర్నలిజం వృత్తిని నమ్ముకుని ఏళ్ళతరబడి జర్నలిస్టుగా పనిచేస్తున్న శ్రీనివాస్ లాంటి అనేక మంది జర్నలిస్టులు సరైన వేతనాలు లేక ఆర్థికంగా అత్యంత ధీనస్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటు ప్రభుత్వం గానీ, అటు యాజమాన్యాలు గానీ జర్నలిస్టుల సంక్షేమ పట్ల ఎంత మాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదని అన్నారు. చనిపోయిన జర్నలిస్టులకు రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్ల నుంచి ఇస్తున్న లక్ష రూపాయల సహాయమే నేటికీ ఇస్తున్నారని, ఈ సహాయాన్ని కనీసం 10 లక్షలకు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు హెల్త్ కార్డులు జారీ చేసి ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


