Census of India 2027 : భారత జనగణన 2027 విజయవంతానికి అందరి భాగస్వామ్యం అవసరం

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్

అల్లూరిజిల్లా ఫిబ్రవరి 28, (త్రినేత్రం న్యూస్): దేశాభివృద్ధికి దిశానిర్దేశం చేసే భారత జనగణన–2027 ప్రక్రియలో ప్రతి పౌరుడు బాధ్యతాయుతంగా భాగస్వామ్యం కావాలని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ కోరారు. పాడేరు కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కుల గణన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ ప్రగతికి పునాది అయిన “సెన్సెస్ ఆఫ్ ఇండియా–2027” ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ జాతీయ ప్రాముఖ్యత కలిగిన కార్యక్రమంలో ప్రజలందరూ చురుకుగా పాల్గొని ఖచ్చితమైన వివరాలను అందించాలని విజ్ఞప్తి చేశారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమంలో మండల తాసిల్దార్లు, ఎంపీడీవోలు, డిప్యూటీ తహసిల్దార్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఖచ్చితమైన గణాంకాలు దేశాభివృద్ధికి పునాది… సర్వేలో సేకరించే ప్రతి సమాచారం అత్యంత ఖచ్చితంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలు అందించే గణాంకాల ఆధారంగానే భవిష్యత్తులో ప్రభుత్వ పథకాల రూపకల్పన, వనరుల కేటాయింపులు జరుగుతాయని పేర్కొన్నారు. కాబట్టి ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా వాస్తవ వివరాలనే నమోదు చేయాలని సూచించారు.
చట్టబద్ధమైన బాధ్యత…. జనగణన చట్టం 1948 ప్రకారం, గణనాధికారులు అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వడం ప్రతి పౌరుడి ప్రాథమిక బాధ్యత అని గుర్తుచేశారు. ఈ ప్రక్రియలో పాల్గొనే సిబ్బంది కూడా చట్టపరమైన నిబంధనలను కచ్చితంగా పాటిస్తూ పారదర్శకంగా వ్యవహరించాలని ఆదేశించారు.
డూప్లికేషన్ నివారణకు చర్యలు…. గతంలో ఎదురైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని, ఈసారి తొలగింపులు, రెట్టింపు నమోదు వంటి లోపాలు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆధునిక డిజిటల్ సాంకేతికత సహాయంతో ఒక వ్యక్తి వివరాలు ఒకేచోట మాత్రమే నమోదయ్యేలా సాఫ్ట్‌వేర్ పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు.
రెండు దశల్లో జనగణన…. ఈసారి జనగణనలో కుల గణనను కూడా చేర్చుతున్నట్లు తెలిపారు. ప్రక్రియ రెండు దశల్లో జరుగుతుందని వివరించారు. మొదటి దశగా గృహాల జాబితా తయారీ, గృహ గణన ఏప్రిల్ 2026 నుండి సెప్టెంబర్ 2026 వరకు జరుగుతుందని, రెండవ దశగా జనాభా గణన ఫిబ్రవరి 2027లో నిర్వహించనున్నట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో గణనాధికారులకు ప్రజలు పూర్తి సహకారం అందించి దేశ ప్రగతికి తోడ్పడాలని కోరారు.
ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ రిజిస్ట్రార్ జనరల్ మరియు జనగణన కమిషనర్ కార్యాలయం ఆదేశాల మేరకు నిర్వహించబడుతుందని చెప్పారు.
మాస్టర్ ట్రైనర్స్‌కు శిక్షణ…. జిల్లా స్థాయి అధికారులకు మాస్టర్ ట్రైనర్స్ ద్వారా ఈ నెల 27వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంచార్జి డిఆర్ఓ అంబేద్కర్, కలెక్టరేట్ పరిపాలనాధికారి ప్రసాదరావు, ఎన్నికల మాస్టర్ ట్రైనర్స్ డాక్టర్ వై జగన్నాథం, త్రినాధరావు, అనుకుల్ కుమార్, శివరాం కుమార్, మండల తాసిల్దార్లు, డిప్యూటీ తాసిల్దార్లు, ఎంపీడీవోలు, సంబంధిత జిల్లా అధికారులు హాజరయ్యారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

success of Census of India 2027

You cannot copy content of this page

Scroll to Top