YSRCP Leaders : జాతీయ నాయకుల సెంటర్ నామకరణంపై రాజకీయాలు చేయొద్దు

TRINETHRAM NEWS
Do not do politics over the naming of the National Leaders Center

వైఎస్సార్సీపీ నాయకుల ఘాటు స్పందన

YSRCP Leaders : త్రినేత్రం న్యూస్, మండపేట, మండపేట పట్టణంలోని వాణి మహల్ సెంటర్ వద్ద మహాత్మా జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రామ్, ఎన్.టి. రామారావు, వంగవీటి రంగా విగ్రహాలతో ఏర్పాటైన సెంటర్‌ను “జాతీయ నాయకుల సెంటర్”గా నామకరణం చేయాలనే ప్రతిపాదనపై రాజకీయాలు చేయడం తగదని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు.
సోమవారం మండపేట పట్టణంలోని విజయలక్ష్మీనగర్ వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఎస్సీ, బిసి, ఓసి సంఘాల వైసీపీ నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ నాయకుల పేరుతో సెంటర్ నామకరణం చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరును కించపరచడం తమ ఉద్దేశం కాదని, ఆయన్ని జాతీయ నాయకుడిగా గౌరవిస్తున్నామని స్పష్టం చేశారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు గౌరవంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కోనసీమ జిల్లాకు ఆయన పేరును నామకరణం చేయడమే కాకుండా, విజయవాడలో 206 అడుగుల ఎత్తులో అంబేద్కర్ విగ్రహాన్ని నిర్మించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కే దక్కుతుందని పేర్కొన్నారు. అలాగే దళితవాడలకు మాత్రమే పరిమితమవుతున్న మహనీయుల విగ్రహాలను మండపేట నడిబొడ్డులో ఏర్పాటు చేయించిన ఘనత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు దక్కుతుందని అన్నారు.
ఎన్టీ రామారావును గౌరవించే అర్హత చంద్రబాబు నాయుడు మరియు అతని అనుచరులకు లేదని విమర్శించారు. ఎన్టీఆర్‌ను పదవి నుండి దింపి మానసికంగా బాధ పెట్టిన వ్యక్తి చంద్రబాబే అని ఆరోపించారు. కాంగ్రెస్ తరఫున ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా పోటీ చేసిన చంద్రబాబు గురించి ఇప్పుడు గౌరవం మాట్లాడటం హాస్యాస్పదమన్నారు.
అదే విధంగా ఎన్టీ రామారావు పేరును ఒక జిల్లాకు నామకరణం చేసి గౌరవించిన ఘనత కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వానిదేనని గుర్తుచేశారు. ప్రస్తుతం నీతిమాలిన రాజకీయాలు చేస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని విమర్శించారు. విద్యపై కూడా ప్రభుత్వానికి ఆసక్తి లేదని, రెండు సంవత్సరాలుగా కాలేజీలకు చెల్లించాల్సిన విద్యార్థుల బకాయిలు ఇంకా చెల్లించలేదని అన్నారు.
ఈ సమావేశంలో విగ్రహాల కన్వీనర్ మందపల్లి రవికుమార్, పలివెల సుధాకర్, యాండ్ర ప్రభాకర్, పిల్లి శ్రీనివాస్, పెంకే వెంకట్రావు, జొన్నపల్లి సత్తిబాబు, ముమ్మిడివరపు బాపిరాజు, మట్టపర్తి గోవిందరాజు, యర్రగుంట అయ్యప్ప, మీగడ శ్రీనివాస్, పెంకే గంగాధర్, మెండు బాపిరాజు, మామిడిశెట్టి సురేష్, పిల్లా అరవరాజు, కుక్కల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top