తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
మద్దతుగా నిలిచిన వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు స్టాలిన్, దళిత సంఘాల నాయకులు
త్రినేత్రం న్యూస్… మాధవరాయుడుపాలెం పంచాయతీ పరిధిలోని చైతన్యనగర్ సమీపంలో సర్వే నెంబర్ 10లో తమకు స్వాధీనంలో ఉన్న భూమిని కుట్రపూరితంగా భూస్వాములు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం ఆందోళనకు దిగారు. వీరికి వైఎస్సార్‌సీపీ కడియం మండల పార్టీ అధ్యక్షులు మరియు గ్రామ సర్పంచ్, న్యాయవాది యాదల సతీష్‌చంద్రస్టాలిన్, దళిత సంఘాల నాయకులు నక్కా వెంకటరత్నరాజు, ముంగమూరి చినబాబు , టీడీపి నాయకులు చికిలే కిషోర్ కుమార్, జనసేన నాయకులు మద్దూకూరి సూరిబాబు, ఫిషర్మెన్ సొసైటీ అధ్యక్షుడు సాక కిరణ్ కుమార్ మాజీ అధ్యక్షుడు బళ్ళ అన్నవరం, మోటిక మునియ్య తదితరులు మద్దతుగా నిలిచారు.
జేగురుపాడు నుంచి పెద్ద ఎత్తున బయలుదేరి వచ్చి కడియం తహసీల్దార్ కార్లాయాన్ని చుట్టుముట్టారు. అధికారులు, భూస్వాములకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. రోడ్డుపై బైఠాయించి తమ నిరసనను ఉధృతం చేసేందుకు ప్రయత్నించారు. దీంతో కడియం పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఏ. వేంకటేశ్వరరావు, ఎస్‌ఐ ప్రసన్నలు ఆందోళన కారులకు నచ్చజెప్పి రోడ్డుమీదనుంచి పక్కకు తరలించారు. దీంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైఠాయించి తమకు న్యాయం చేయాలని నినాదాలు చేసారు.
ఈ సందర్భంగా జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్‌చంద్రస్టాలిన్ మాట్లాడుతూ సంబంధిత భూమి సుమారు యాభయ్యేళ్ళ నుంచి జేగురుపాడు గ్రామానికి చెందిన దళితుల ఆధీనంలోనే ఉందన్నారు. వారక్కడ సాగు చేసుకుంటున్నారన్నారు. అయితే మాధవరాయుడుపాలెం టీడీపీ సర్పంచ్ అన్నందేవుల చంటి సదరు భూమిని కాజేసే ఉద్దేశంతో చైతన్యనగర్‌కు చెందిన వారిని రెచ్చగొట్టి అక్కడ వివాదాన్ని రేపారన్నారు. ఎంతో స్నేహంగా ఉండే జేగురుపాడు, చైతన్య నగర్ వాసుల మధ్య గొడవలు రాజేసి, ఆ భూమిని కాజేయాలన్న ఉద్దేశంతోనే ఆయన ఇదంతా చేస్తున్నారన్నారు.
ఈ భూమికి సమీపంలోనే ఉన్న ఎక్స్ సర్వీస్‌మెన్ భూమిని కూడా గతంలో వారిని బెదిరించే ఇదేవిధంగా చంటి కాజేసారని స్టాలిన్ ఆరోపించారు. గ్రామంలో ఏ ఆధారం లేని వారి భూములను కూడా చంటి కాజేసిన చరిత్ర ఉందన్నారు. అయితే తమ గ్రామస్తుల సమస్యను రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి దృష్టికి తీసుకువెళితే ఆర్డీవోను విచారణకు పంపించారన్నారు. కానీ ఇరు పక్షాలకు సమాచారం ఇవ్వకుండా, ఏకపక్షంగా ఒక్క చంటిని మాత్రమే అక్కడకు పిలిచి ఆర్డీవో తూతూ మంత్రంగా విచారణ చేసి వెళ్ళిపోయారన్నారు.
వివాదంలో ఉన్న భూమిని సందర్శించినప్పుడు ఇరు పక్షాలను పిలిచి మాట్లాడాల్సిన బాధ్యత ఆర్డీవోపై ఉందని, కానీ అందుకు విరుద్దంగా ఆయన వ్యవహరించారన్నారు. దీంతో తమకు అన్యాయం చేస్తారన్న భయంతో జేగురుపాడు గ్రామానికి చెందిన దళితులను పోరాటబాట పట్టారని వివరించారు. ఆర్డీవో కృష్ణనాయక్ వచ్చి తమ గ్రామస్తుల సమస్యను కూడా వినేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళేది లేదని గ్రామస్తులంతా తేల్చిచెప్పారు. ఆందోళన నేపథ్యంలో ధవళేశ్వరం, బొమ్మూరు తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున పోలీసు బలగాలు అక్కడికి చేరుకున్నాయి.
అనంతరం సంబంధిత ఉన్నతాధికారులతో స్టాలిన్ చర్చించారు. పుష్కరాల సన్నాహక సమావేశంలో ఉన్నతాధికారులు ఉన్నందున ఈనెల 25న జేగురుపాడు అంబేద్కర్ పార్కులో ప్రజలతో సమావేశం అయ్యేందుకు అధికారులు అంగీకరించారన్నారు. దీంతో ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. తహసీల్దార్ సునీల్‌కుమార్ కూడా ఆందోలన కారులకు వివరించారు. దీంతో ఆందోళన విరమించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు.ఈఆందోళనలో జేగురుపాడు ఫిషర్మెన్ సంఘ సభ్యులు, మహిళలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


