జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వర్ రెడ్డి
త్రినేత్రం న్యూస్. రాజమహేంద్రవరం : దేశానికి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిగా, రాష్ట్రంలో పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డిని ముఖ్యమంత్రిగా చేసే వరకు కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో సమిష్టిగా పార్టీని ముందుకు తీసుకుని వెళ్లాలని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర రెడ్డి పిలుపునిచ్చారు. మే 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎఐసిసి, పిసిసి పిలుపు మేరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాన్ని చేపడుతున్నామని తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ని రాష్ట్రంలో 95.4 శాతం మెరుగైన పనితీరుతో ప్రధమ స్థానంలో నిలపడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హార్షాతిరేకాలు వ్యక్తం చేసాయి. ఈనెల 25వ తేదీన విజయవాడలో రాష్ట్ర కాంగ్రెస్ ఆఫీస్ బేరర్లు, రాష్ట్ర ఇన్‌చార్జ్ మాణిక్కం ఠాగూర్, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి సారధ్యంలో జరిగిన డిసిసి అధ్యక్షుల సమావేశంలో ఈ విషయాన్ని స్వయంగా పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రకటించడం జరిగిందని టీకే వివరించారు.
ఏపీసిసి అధ్యక్షురాలుగా షర్మిళ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ఊపు వచ్చిందన్నారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు ఎఐసిసి, పిసిసి ఇచ్చిన పిలుపు మేరకు అన్ని కార్యక్రమాలను సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం వల్లనే జిల్లాకు ప్రధమ స్థానం దక్కిందన్నారు. దేశంలో, రాష్ట్రంలో త్వరలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని, తూర్పుగోదావరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహంగా పనిచేసే వారందరికి సముచిత స్థానం కల్పిస్తామని టీకే భరోసా ఇచ్చారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎఐసిసి సమావేశంలో చేసిన తీర్మానాల ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ఉద్యమాలు చేపడుతుందని తెలిపారు. బీజేపీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని పక్కన పెట్టి హిందు రాజ్యాంగాన్ని తేవాలని కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ముస్లింలు, క్రైస్తవులను వేధింపులకు గురిచేస్తూ వారికి దేశంలో స్థానం లేకుండా చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ అడ్డుకుని తీరుతుందన్నారు. మే 1వ తేదీ నుంమచి 30వ తేదీ వరకు రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమంతో పాటు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమం నిర్వహిస్తామన్నారు.
తూర్పుగోదావరి జిల్లాను అగ్రస్థానంలో నిలపడానికి కృషిచేసిన కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు టీకే కృతజ్ఞతలు తెలిపారు. మేడే సందర్భంగా 1వ తేదీన సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులకు పోస్టల్ శాఖ ద్వారా 10 లక్షల ప్రమాద భీమాను ఉచితంగా చేయిస్తామని, అయితే వారు కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా కప్పి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రఫీ మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రానికి చేసేందేమీ లేదని విమర్శించారు. రాహుల్ గాంధీ జమ్మూ కాశ్మీర్ వెళ్లి ఉగ్రదాడిలో గాయపడిన బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారని, మరే ఇతర నాయకులు అక్కడికి వెళ్లలేదని ఎద్దేవా చేసారు. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను మోదీ నియమించడానికి చేస్తున్న ప్రయత్నాల పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేసారు.
పిసిసి ఉపాధ్యక్షుడు సోడదాసి మార్టిన్ లూథర్ మాట్లాడుతూ ఏడు అంశాలతో రాష్ట్రంలో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం జరుగుతుందని, జిల్లా, నియోజకవర్గం, గ్రామస్థాయిలో కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ ను ఆదర్శంగా తీసుకుని పార్టీని ప్రతి ఒక్కరు ముందుకు తీసుకుని వెళ్లాలని పిసిసి సమావేశంలో సూచించారంటే డిసిసి అధ్యక్షుడు టీకేపై వారికి ఉన్న నమ్మకాన్ని తెలియచేస్తుందన్నారు. రాష్ట్ర ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడయార్ డీసీసీ అధ్యక్షుడు టీకే అందుబాటులో లేని 15 రోజుల్లో పార్టీని బలోపేతం చేయడానికి కృషిచేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆయనను ఘనంగా సత్కరించారు. అనంతరం జిల్లాలోని వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కో ఆర్డినేటర్లు, అనుబంధ సంఘాల నాయకులు టీకేను దుశ్శాలువా, పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారత, ఐఎన్‌టియుసి జిల్లా అధ్యక్షుడు జేటీ రామారావు, ఇన్‌చార్జ్‌లు తాడాల కొండ్రాజు, వై.శ్రీనివాస్ వడయార్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్ధుల్లా షరీఫ్, పార్టీ సీనియర్ నాయకులు ఎండి రఫీ, బెజవాడ రంగారావు, పట్నాల శ్రీనివాసరావు, మేడవరపు భద్రం దొర, దేవత సుధాకర్, చిన్నం మురళీకృష్ణ, శాఖ పుల్లారావు, బిల్డర్ బాబీ, కిశోర్‌కుమార్ జైన్, వివిధ మండలాల ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, వివిధ విభాగాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


