గిరిజనుల కోసం ప్రత్యేక డీఎస్సీ విడుదల చేయాలి: పాచి పెంట శాంతకుమారి
అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్ అరకు నియోజవర్గం ఇంచార్జ్, మే 4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డీఎస్సీలో గిరిజనులకు అన్యాయం జరుగుతోందంటూ ‘ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ సాధన కమిటీ’ పిలుపుపై చేపట్టిన మన్యం రాష్ట్ర బంద్ రెండో రోజు ఘనంగా కొనసాగింది. ఈ బంద్‌కు ఏపీ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాచి పెంట శాంతకుమారి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ, వందశాతం ఉద్యోగ రిజర్వేషన్ హామీ ఇచ్చి ఇప్పుడు విస్మరించారని ఆరోపించారు. ఎస్‌టైడిఏ పరిధిలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాలకు కేవలం కొన్ని ఉద్యోగాలే కేటాయించబడటం తీవ్రంగా అన్యాయం అన్నారు.
“పాడేరు డివిజన్‌లో 400 పోస్టులకు కేవలం 24, రంపచోడవరం, చింతూరు, కె.ఆర్.పురం ప్రాంతాల్లో 1035 పోస్టులకు కేవలం 61, పార్వతీపురం, సీతంపేట ప్రాంతాల్లో కేవలం 10 పోస్టులు గిరిజనులకు కేటాయించడాన్ని ఖండిస్తున్నాం” అని ఆమె పేర్కొన్నారు. 94% ఆదివాసీలు నివసిస్తున్న ప్రాంతాల్లో కేవలం 6% ఉద్యోగాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు.
గతంలో అమల్లో ఉన్న జి.ఓ. నెం.3 ద్వారా ఆదివాసీలకు 100% ఉపాధ్యాయ ఉద్యోగ హక్కు కల్పించబడిందని, ఈ ఉత్తర్వు రద్దు చేయడం వల్ల ఆదివాసీ యువత తీవ్ర నిరాశకు లోనవుతుందని అన్నారు. గిరిజన కూటమిలో ఉన్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఇప్పటివరకు స్పందించకపోవడం బాధాకరమని అన్నారు.
ఈ సందర్భంలో, స్పెషల్ డీఎస్సీ విడుదల చేయాలని, 100% ఉపాధ్యాయ నియామక చట్టానికి ఆర్డినెన్స్ జారీ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే, ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్టులను మెగా డీఎస్సీ నుండి మినహాయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ తెలగంజి సోమేశ్వరరావు, బీసీ సెల్ జిల్లా చైర్మన్ కన్నూరి ప్రవీణ్, సీనియర్ నాయకులు పాచిపెంట చిన్నస్వామి, కిల్లో రాజుబాబు, కుమ్మడిశెట్టి సుశీల, గంజాయి జ్ఞానసుందరి, ఖాన్ గుల్సన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


