Trinethram News : తెలంగాణలో స్థానిక సంస్థలకు కాంగ్రెస్ సమాయత్తం అవుతోంది. అధికారంలో ఉండటంతో ఈ ఎన్నికల్లో గెలుపును ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. 42 శాతం బీసీ రిజర్వేషన్లు…పథకాలు తమకు కలిసి వస్తాయని ఆ పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. అటు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జ్ లకు స్థానిక ఎన్నికల బాధ్యతలు కేటాయించింది. బీజేపీ ఈ సారి తమ సత్తా ఏంటో నిరూపిస్తామని చెబుతోంది. కాగా, కాంగ్రెస్ ముందుగానే అభ్యర్ధుల ఖరారు పైన కీలక నిర్ణయం తీసుకుంది. పోటీ విషయంలోనూ స్పష్టత ఇస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలను సీఎం రేవంత్ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల ముందుగానే ఎన్నికల పైన పూర్తి కసరత్తు చేసారు. ఇప్పుడు పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన దిశా నిర్దేశం చేస్తున్నారు. ఈనెల 9వ తేదీన స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై దృష్టి పెట్టారు. రేపు(ఆదివారం) సాయంత్రంలోగా ప్రతీ స్థానానికి ముగ్గురు అభ్యర్థుల చొప్పున సిఫారసు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు వరుస సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు.. నియోజకవర్గ ఇంఛార్జ్ లతో మంత్రాంగం సాగిస్తున్నారు. అభ్యర్ధుల ఖరారు పైన సామాజిక సమీకరణాలు.. రిజర్వేషన్ల ఆధారంగా ముగ్గురు చొప్పున ఎంపిక చేస్తున్నారు.
అదే విధంగా జెట్పీటీసీ అభ్యర్థుల ఎంపిక బాధ్యతని కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ కమిటీకి అప్పగించారు. కాగా, సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపికని డీసీసీలకు అప్పగిస్తూ నిర్ణయించారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఎంపిక బాధ్యతను సెక్రటరీలకు అప్పగించారు రేవంత్. ఈ నేపథ్యంలో ఈనెల 8వ తేదీన అన్ని స్థానాలకు అభ్యర్థుల ప్రకటన చేయాలని టీపీసీసీ నిర్ణయించింది. ఈ నెల9న కోర్టు తీర్పు తరువాత తమ కార్యాచరణ వేగవంతం చేయాలని బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆలోచన చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం కోర్టు తీర్పు సమయానికి అభ్యర్ధుల ఖరారు తో పాటుగా పూర్తి స్థాయిలో ఎన్నికలకు సమాయత్తం కావాలని నిర్ణయించారు. దీంతో.. కాంగ్రెస్ తాజా నిర్ణయాలు ఎంత వరకు కలిసి వస్తాయనేది తేలాల్సి ఉంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


