CM meets former Maoist Leader : మాజీ మావోయిస్టు అగ్ర నేతలతో ముఖ్యమంత్రి భేటీ

TRINETHRAM NEWS

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27 : జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టు అగ్రనేతలతో ముఖ్యమంత్రి ఎ .రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు సచివాలయంలో భేటీ అయ్యారు . ఈ సందర్భంగా వారి అభ్యర్థన మేరకు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్యమంత్రి వారితో సుదీర్ఘంగా ముఖాముఖి చర్చించారు. హింస వల్ల ఏ సమస్యకూ శాశ్వత పరిష్కారం లభించదని, ప్రజల ఆకాంక్షలు కేవలం ప్రజాస్వామ్య మార్గంలోనే నెరవేరుతాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారితో అన్నారు.

దశాబ్దాల పాటు అడవుల్లో గడిపిన వారు తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకంతో వెనక్కి రావడం అభినందనీయమని పేర్కొంటూ, వారు సమాజంలో గౌరవప్రదంగా జీవించేందుకు ప్రభుత్వం తరఫున పూర్తి రక్షణ, పునరావాస కల్పనలో ఎటువంటి లోటు లేకుండా చూస్తామని భరోసా ఇచ్చారు.

పొరుగు రాష్ట్రాల్లో అమలవుతున్న పునరావాస విధానాలను పరిగణనలోకి తీసుకుని, సాదరణ జీవితం గడిపేందుకు ముందుకు వచ్చిన వారికి మరింత మెరుగైన ప్యాకేజీని అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు , రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి. శివధర్ రెడ్డి , ఇంటెలిజెన్స్ అడిషనల్ డిజిపి విజయ్ కుమార్ , ఎస్.ఐ.బి (ఇంటెలిజెన్స్) ఐజిపి బి. సుమతి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మావోయిస్టుల పునరావాస పురోగతిని ముఖ్యమంత్రికి వివరిస్తూ, గత రెండేళ్లలో ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 591 మంది మావోయిస్టులు జనజీవ స్రవంతిలో కలిసి సాధారణ పౌరులుగా జీవిస్తున్నారని డిజిపి బి.శివధర్ రెడ్డి తెలిపారు. పోలీసు శాఖ సమన్వయ కృషి, ప్రభుత్వం అమలు చేస్తున్న మెరుగైన పునరావాస విధానాల వల్ల అగ్రనేతల్లో సైతం మార్పు వచ్చిందని ఆయన వివరించారు.
ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మాజీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ సభ్యులు , పొలిట్ బ్యూరో సభ్యుడు తిపిరి తిరుపతి అలియాస్ దేవుజీ అలియాస్ రమేష్ అలియాస్ సంజీవ్ అలియాస్ చేతన్ అలియాస్ కుమ్మ దాదా (సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్‌చార్జ్), మాజీ సెంట్రల్ కమిటీ సభ్యులు మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ శంకరన్న అలియాస్ చంద్రన్న అలియాస్ సోమన్న, పోతుల పద్మావతి అలియాస్ కల్పన అలియాస్ మైనాబాయి అలియాస్ మైనక్క అలియాస్ సుజాతలతో పాటు మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు బడే చొక్కారావు అలియాస్ దామోదర్ (తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి), నూనే నర్సింహారెడ్డి అలియాస్ గంగన్న అలియాస్ రాహుల్ అలియాస్ సన్ను ఉన్నారు.

సాయుధ పోరాటాన్ని వీడి ప్రధాన స్రవంతిలోకి వచ్చేందుకు అవకాశం కల్పించినందుకు వారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో జరిగిన ఈ భేటీలో వారు చేసిన విజ్ఞప్తులకు సానుకూల పరిష్కారం చూపుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Chief Minister meets former Maoist leader

You cannot copy content of this page

Scroll to Top