Trinethram News : 7th Jan 2024
Chandrababu: రా.. కదలిరా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడిద్దామని చంద్రబాబు పిలుపు
ప.గో.: రా.. కదలిరా.. రాబోయే ఎన్నికల్లో వైసీపీ ( YCP ) ని చిత్తుగా ఓడిద్దామని తెలుగుదేశం ( TDP ) జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ( Nara Chandrababu Naidu ) పిలుపునిచ్చారు..
ఆదివారం నాడు ఆచంట రా.. కదలిరా సభలో చంద్రబాబు ప్రసగించారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి, వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచే..టీడీపీ-జనసేన జైత్రయాత్ర మొదలవుతుందని తెలిపారు. ప.గో. జిల్లాలో 15 స్థానాలు టీడీపీ-జనసేన పార్టీవేనని చెప్పారు. ఏపీలో వైసీపీ పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. వైసీపీ పాలనలో ఒక్కరైనా సంతోషంగా ఉన్నారా అని ప్రశ్నించారు. జగన్ సినిమా అయిపోయిందని.. మాయమాటలు చెప్పి ఏపీ ప్రజలను మోసం చేశాడని ధ్వజమెత్తారు.
జగన్ ఏపీలో విధ్వంసం సృష్టించారు
వ్యవస్థలను జగన్ సర్వనాశనం చేశాడని.. రాబోయే ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.టీడీపీ హయాంలో అక్వా రంగానికి పెద్దపీట వేశామన్నారు. జగన్ పాలనలో అక్వా రంగం కుదేలైందని.. అక్వా రంగ ఖర్చులు మూడు రెట్లు పెరిగిందని చెప్పారు. వైసీపీ హయాంలో ఫీడ్, కరెంట్ బిల్లులు పెరిగాయని అన్నారు. జగన్ వచ్చాక ఏపీలో విధ్వంసం సృష్టించారన్నారు. ప.గో. జిల్లాలో రహదారులన్నీ నాశనం అయ్యాయన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక అన్ని చార్జీలనూ పెంచేశారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అక్వా రంగానికి రూపాయిన్నరకే కరెంట్ ఇస్తామని ప్రకటించారు. అక్వా రంగానికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత టీడీపీ తీసుకుంటుందని తెలిపారు. సాగు నీరు సరిగా ఇవ్వక క్రాప్ హాలిడే ఇచ్చే పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులకు అన్నివిధాలుగా అండగా ఉంటామని చంద్రబాబు పేర్కొన్నారు.


