త్రినేత్రం న్యూస్, కడియం, : ప్రకృతిలోనే పరమాత్మ నివసిస్తాడని, ప్రతి మొక్క ఒక జీవన సందేశాన్ని మనకు అందిస్తుందని బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం కడియపులంకలో ఆయన పర్యటన ఆధ్యాత్మికతకు ప్రకృతి సౌందర్యానికి అద్దం పట్టింది. కడియపులంకలో బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు వారి శిష్యుడు మల్లు విష్ణు ఆహ్వానం మేరకు ఆయన కడియపులంకకు విచ్చేశారు. ముందుగా మల్లు విష్ణు నివాసానికి చేరుకున్న చాగంటి కోటేశ్వరరావు విష్ణు కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా ముచ్చటించారు. అనంతరం ప్రముఖ నర్సరీ శివాంజనేయ నర్సరీని సందర్శించారు.
ఈ సందర్భంగా కడియం నర్సరీ సంఘం మాజీ అధ్యక్షులు, శివాంజనేయ నర్సరీ అధినేత మల్లు పోలరాజు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావుకు ఘన స్వాగతం పలికారు. నర్సరీలోని వివిధ రకాల అలంకార మొక్కలు, ఔషధ మొక్కలు, అరుదైన జాతి వృక్షాలను పరిశీలించిన చాగంటి కోటేశ్వరరావు, ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఇది కేవలం నర్సరీ మాత్రమే కాదు ఇది ఒక జీవన పాఠశాల అని అన్నారు. ప్రకృతి మనకు సహనం, సహజత్వం, సేవాభావాన్ని నేర్పుతుంది. ఇలాంటి అద్భుతమైన మొక్కలను ప్రేమతో, ఓర్పుతో తీర్చిదిద్దుతున్న కడియం రైతులు నిజంగా అభినందనీయులు అని ఆయన అన్నారు. స్థానిక రైతుల కృషి వల్లే కడియం ప్రాంతం దేశవ్యాప్తంగా నర్సరీల కేంద్రంగా గుర్తింపు పొందిందని కొనియాడారు.
ప్రకృతితో మమేకమై జీవిస్తే మనసు శుద్ధి చెందుతుందని, మొక్కల సంరక్షణ కూడా ఒక యజ్ఞంతో సమానమని ఆయన వ్యాఖ్యానించారు. చాగంటి కోటేశ్వరరావు పర్యటన కడియం నర్సరీల విశిష్టతను మరోసారి చాటిచెప్పిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కడియం మండల పరిషత్ అధ్యక్షులు వెలుగుబంటి వెంకట సత్య ప్రసాద్, ప్రముఖ రచయిత డాక్టర్ దేవవరపు నీలకంఠరావు,నర్సరీ సంఘం డైరెక్టర్ మల్లు శివ, నర్సరీ నిర్వాహకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


