బీసీ ప్రముఖుల విగ్రహాలు అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాడు
మా జాతి నాయకుల విగ్రహాలకూ మోకాలడ్డాడు
ఎంపీగా 5 ఏళ్ళు సొంత సామాజిక వర్గానికి ఏంచేయలేదు
ఎర్రన్నాయుడు విగ్రహం పెడితే నీకేందుకు కడుపుమంట
తప్పుమీద తప్పు చేస్తున్న భరత్
టెన్త్ పాసైన గీతకులాల విద్యార్థులకు స్కాలర్ షిప్ లు ఇస్తాం
25 లోగా దరఖాస్తు చేసుకోండి
ఏపీ శెట్టిబలిజ సంక్షేమ… అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు
రాజమహేంద్రవరం: బీసీ ప్రముఖ నాయకుల విగ్రహాలు అడ్డుకుంటున్న మాజీ ఎంపీ మార్గాని భరత్ బీసీ ద్రోహి అని ఏపీ శెట్టిబలిజ సంక్షేమ… అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు ధ్వజమెత్తారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ భరత్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.భరత్ ఎంపీగా ఉన్న సమయంలో కూడా లాలాచెరువు సెంటర్ లో శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం, గోదావరి గట్టున ప్రముఖ హాస్యనటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహం ఏర్పాటు చేయనివ్వకుండా అడ్డుకున్నాడని మండిపడ్డారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా భరత్ స్పందించలేదని, కూటమి అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సహకారంతో దొమ్మేటి వెంకటరెడ్డి, రేలంగి వెంకట్రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేశారని ఆయన చెప్పారు. భరత్ అధికారంలో ఉన్న ఐదేళ్ళు సొంత సామాజిక వర్గంలో ఒక్కరికి కూడా ఎలాంటి అవకాశాలు కల్పించలేదని ఆయన విమర్శించారు.
ఇప్పుడు ప్రముఖ బీసీ నేత,బీసీల ఆరాధ్య దైవం దివంగత మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడి విగ్రహం విఎల్ పురం సెంటరులోని ఒక ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేస్తుంటే నగరపాలకసంస్థకు పిటీషన్ పెట్టించి ఆటంకాలు కల్పిస్తున్నాడని కుడుపూడి సత్తిబాబు చెప్పారు. ఇటీవల దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభకు హాజరైన మాజీ ఎంపీ, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ,ఆచంట ఎమ్మెల్యే, మాజీమంత్రి పితాని సత్యనారాయణ సలహా మేరకు కింజరాపు ఎర్రన్నాయుడి విగ్రహం, బొబ్బులి పులిగా పేరుగాంచిన తాండ్ర పాపారాయుడు విగ్రహం రాజమండ్రిలో నెలకొల్పేందుకు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సన్నాహాలు చేస్తుంటే పనీపాటు లేకుండా ఖాళీగా ఉన్న భరత్ ఆ విగ్రహాలను ఏర్పాటు చేయనివ్వకుండా మోకాలడ్డుతున్నాడని ఆయన విమర్శించారు. పైగా కడిగిన ముత్యం లాంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మీద అభాండాలు వేస్తూ భరత్ నీచ రాజకీయాలు చేస్తున్నాడని మండిపడ్డారు. నిబంధనల ప్రకారం విగ్రహాలు తొలగించాలంటే రాజమండ్రి నగరంలోని 90 శాతం విగ్రహాలు తొలగించాల్సి ఉంటుందని కుడుపూడి సత్తిబాబుపేర్కొన్నారు.
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సహకారంతో త్వరలో రాజమండ్రిలో సర్దార్ పాపన్న గౌడ్ విగ్రహం ఏర్పాటు చేస్తున్నట్లు కుడుపూడి సత్తిబాబు వెల్లడించారు. ఎంపీగా ఉన్నప్పుడు ఏదో ఘన కార్యాలు చేసినట్టు గొప్పలు చెప్పుకునేవాడని, అలా చేసిఉంటే మొన్నటి ఎన్నికల్లో భరత్ చిత్తుగా ఎందుకు ఓడిపోయాడని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఈ పదకొండు నెలల్లో సీఎం సహాయ నిధి ద్వారా రూ.3 కోట్లు సహాయంగా అందించారని ఆయన తెలిపారు. ఇకనైనా వైసీపీ నాయకులు జాతి నాయకుల విగ్రహాలను గౌరవించాలని ఆయన హితవు పలికారు.
ఇటీవల పదోతరగతి ఫలితాల్లో 525 మార్కులకు పైగా సాధించిన రాష్ట్రంలోని గీత కులాల విద్యార్థులకు కార్పొరేషన్ చైర్మన్ గా తన సొంత డబ్బుతో స్కాలర్ షిప్ లు అందచేస్తానని కుడుపూడి సత్తిబాబు చెప్పారు. ఈనెల 25 వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని కోరారు. అర్హులంతా హాల్ టికెట్,మార్కుల లిస్ట్, కుల ధృవీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. ఇతర వివరాలకు తన పిఎ ప్రకాష్ సెల్ నెంబర్ 9346308347 లేదా 9550694932 నెంబర్లకు సంప్రదించాలని సత్తిబాబు కోరారు. విలేకర్ల సమావేశంలో టీడీపీ బీసీ సెల్ అధ్యక్షుడు బుడ్డిగ రవి, తెలుగు యువత నాయకుడు చింతపల్లి నాని పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


