HM Suspension : బంగారుమెట్ట బాలికల పాఠశాల హెచ్‌ఎం సస్పెన్షన్

TRINETHRAM NEWS

పీఓ ఆకస్మిక తనిఖీ – విద్యా ప్రమాణాల్లో లోపాలపై కఠిన చర్యలు

అరకులోయ ఫిబ్రవరి 13, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు, మండలంలోని బంగారుమెట్ట జీటీడబ్ల్యూఏ బాలికల ఆశ్రమ పాఠశాలను గురువారం పాడేరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి, ఇన్‌చార్జ్ జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీ పూజ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
పాఠశాల చేరుకున్న వెంటనే ఆమె తరగతి గదులను సందర్శించి విద్యార్థినులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వసతులు, భోజనం, వసతి పరిస్థితులు, బోధన తీరుపై వివరాలు తెలుసుకున్నారు. చదువులు సక్రమంగా సాగడం లేదని, పాఠాలు స్పష్టంగా అర్థం కావడం లేదని విద్యార్థినులు తెలిపినట్లు ఆమె గుర్తించారు.
బోధనలో నిర్లక్ష్యం, విద్యా ప్రమాణాలు పాటించకపోవడం, పాఠశాల నిర్వహణలో లోపాలు ఉన్నాయని ప్రాథమికంగా తేలడంతో, పాఠశాల ప్రధానోపాధ్యాయుని తక్షణమే సస్పెండ్ చేస్తూ పీఓ ఉత్తర్వులు జారీ చేశారు.
అలాగే మిగిలిన ఉపాధ్యాయులందరినీ తీవ్రంగా మందలించారు. విధుల పట్ల అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందని స్పష్టం చేశారు. పనితీరులో తక్షణమే మార్పు తీసుకురావాలని, లేకపోతే మరింత కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు.
ఈ తనిఖీతో పాఠశాల సిబ్బందిలో అలజడి నెలకొంది. ఇకపై ఇలాంటి అక్రమాలు, నిర్లక్ష్యం పట్ల ఉపేక్షించేది లేదని పీఓ స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Bangarumetta Girls School HM Suspension

You cannot copy content of this page

Scroll to Top