జూలై 14, 2026
TRINETHRAM NEWS
Araku leaders

Araku Leaders : అరకులోయ జూలై 9, (త్రినేత్రం న్యూస్): బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకొని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు లోయ నియోజకవర్గంలోని అరకు మండల కేంద్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
అరకు నాలుగు రోడ్ల కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అరకు నియోజకవర్గ ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఎమ్మెల్సీ కుంభ రవిబాబుతో కలిసి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ అందించిన సేవలను స్మరించుకుంటూ ఆయన సంక్షేమ పాలనను కొనియాడారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కుంభ రవిబాబు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు మరియు మధ్యతరగతి కుటుంబాల అభ్యున్నతికి వైఎస్సార్ అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారని పేర్కొన్నారు. విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి వేలాది కుటుంబాలకు అండగా నిలిచిన మహానేతగా వైఎస్సార్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.
గిరిజన ప్రాంతాల్లో పోడు భూముల పట్టాల పంపిణీ ద్వారా గిరిజనుల జీవనోపాధికి బలమైన పునాది వేసిన నాయకుడిగా ఆయనను గుర్తు చేశారు. అలాగే ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు వంటి పథకాల ద్వారా పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు.
వైఎస్సార్ ఆశయాల సాధనకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, పార్టీని మరింత బలోపేతం చేసి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేయడానికి అందరూ సమిష్టిగా పనిచేయాలని ఆయన తెలిపారు, అనంతరం వైఎస్సార్ 77వ జయంతిని పురస్కరించుకుని అరకు ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేసి మానవతా సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, ఉమ్మడి విశాఖ జిల్లా వైఎస్సార్‌సీపీ అల్లూరి జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, నాయకులు కమిడి అశోక్, వైసీపీ ఎస్టి సెల్ రాష్ట్ర కార్యదర్శి పాంగి చిన్నారావు,గుడివాడ ప్రకాష్ రావు, రేగం చాణక్యతో పాటు అరకు, డుంబ్రిగూడ మండలాలకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page