త్రినేత్రం న్యూస్, కడియం. బాల్య వివాహానికి సహకరించినా, ప్రయత్నించినా, నిర్వహించినా చట్టం ప్రకారం రెండు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించబడతాయని జిల్లా బాలల పరిరక్షణ విభాగం బాలల రక్షణ అధికారి జి. క్రాంతిలాల్ అన్నారు. బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తూర్పు గోదావరి జిల్లా సంయుక్త ఆధ్వర్యంలో కడియం మండలం కడియపులంక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రాంతి లాల్ మాట్లాడుతూ బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం అమ్మాయికి 18 సంవత్సరాలు, అబ్బాయికి 21 సంవత్సరాలు నిండకముందే వివాహం చేయడం బాల్య వివాహమని తెలిపారు.
విద్యార్థులు ఎవరైనా బాల్య వివాహాన్ని ఎదుర్కొనే పరిస్థితి వచ్చినప్పుడు తల్లిదండ్రులకు ఖచ్చితంగా తెలియజేయాలని, బాల్య వివాహానికి స్పష్టంగా నిరాకరించాలని సూచించారు. మంచి చదువుతో అభివృద్ధి చెందుతూ వ్యక్తిగత భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తల్లిదండ్రులు, గురువులు చెప్పే మాటలను గౌరవిస్తూ ముందుకు సాగాలని అన్నారు. అలాగే మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఎవరి స్పర్శతో ఆనందంగా, భద్రంగా అనిపిస్తుందో అది మంచి స్పర్శ అని, అది కేవలం తల్లిదండ్రుల ద్వారా మాత్రమే ఉండాలని తెలిపారు. ఎవరి స్పర్శతో అసహ్యంగా ఇబ్బందిగా అనిపిస్తుందో అది చెడు స్పర్శ అని వివరించారు. బాలల శరీరంలోని రహస్య భాగాలను ఎవరూ ముట్టుకోవడానికి హక్కు లేదని, ఎవరైనా అలా ప్రయత్నిస్తే స్పష్టంగా “డోంట్ టచ్” అని చెప్పాలని సూచించారు. ప్రతి విద్యార్థి తన ఉజ్వల భవిష్యత్తును బంగారు బాటలో నిర్మించుకుని, జీవితంలో తలెత్తుకుని జీవించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బాలలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2012 (పోక్సో చట్టం) గురించి వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు లేదా బాలలపై వేధింపులు జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098, పోలీస్ 100, 112 నెంబర్లకు సమాచారం అందించాలని సూచించారు.
వ్యక్తిగత భద్రత విషయంలో బాలికలు ఒంటరిగా ఉండకూడదని, ఒంటరిగా ప్రయాణాలు చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. మద్యం సేవించిన వ్యక్తులకు దూరంగా ఉండాలని, మద్యం మంచిది కాదని స్పష్టం చేశారు. వస్త్రధారణ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు చెప్పే మాటలను వింటూ, గురువులను గౌరవిస్తూ అభివృద్ధి చెందాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చీఫ్ ఎల్‌ఏడీసీ టి. మహేష్ మాట్లాడుతూ, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు న్యాయ సేవలను వినియోగించు కోవాలని, ఉచిత న్యాయ సహాయం కోసం 15100 నెంబర్‌కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. జిల్లా కోఆర్డినేటర్, క్రాఫ్ ఆర్గనైజేషన్ బి. రాజ్‌కుమార్, మాట్లాడుతూ బాలల హక్కులైన జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, పాల్గొనే హక్కుల గురించి విద్యార్థులకు వివరించారు. బాలలు తమ హక్కులను తెలుసుకుని వినియోగించు కుంటూ ముందుకు సాగాలని సూచించారు.
అసిస్టెంట్ ఎల్‌ఏడీసీ జి. ఉదయ్‌కుమార్ మాట్లాడుతూ అపరిచిత వ్యక్తులు నచ్చే విధంగా మాట్లాడుతూ దగ్గరవుతారని, అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. కనీస వివాహ వయస్సు వచ్చే వరకు ఎవరూ వివాహం చేసుకోకూడదని, బాల్య వివాహాల వల్ల మాతృ, శిశు మరణాలు అధికంగా జరుగుతాయని వివరించారు. బాల్య వివాహానికి ఎవరైనా ప్రయత్నిస్తే ఖచ్చితంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థులతో బాల్య వివాహ రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌ఎస్‌ఏ పీఎల్‌వీలు వై. వెంకటేశ్వరరావు, ఎ. సూర్యచంద్రరావు, మహిళా సంరక్షణ కార్యదర్శి ఆర్. హిమశైలజ, ప్రధానోపాధ్యాయులు కె. జయలక్ష్మి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


