Murdered after Kidnapping : అమెరికాలో మరో విషాదం.. కిడ్నాపైన భారత సంతతి వ్యక్తి హత్య

TRINETHRAM NEWS

గురుద్వారా బయట అపహరించిన గుర్తుతెలియని వ్యక్తులు

సరస్సు సమీపంలో లభ్యమైన అవతార్ సింగ్ మృతదేహం

టార్గెట్ వేరే వ్యక్తి, పొరపాటున హత్య జరిగిందని పోలీసుల అనుమానం

అమెరికాలో మరో విషాదం చోటుచేసుకుంది. కాలిఫోర్నియాలో కిడ్నాప్‌కు గురైన భారత సంతతి వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. 57 ఏళ్ల అవతార్ సింగ్ మృతదేహాన్ని బెర్రీస్సా సరస్సు సమీపంలో అధికారులు కనుగొన్నారు. గత వారం ట్రేసీ నగరంలోని ఓ గురుద్వారా వెలుపల ఆయన్ను అపహరించుకుపోయిన నాలుగు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే… ఈ నెల‌ 17న ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అవతార్ సింగ్‌ను బలవంతంగా ఓ తెల్లని కారులో ఎక్కించుకుని తీసుకెళ్లారు. ఆయన ప్రతిఘటించినా దుండగులు అపహరించుకుపోయారు. ఆయన భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా కిడ్నాప్ దృశ్యాలు రికార్డయ్యాయి.

“కిడ్నాప్ అయిన‌ అవతార్ సింగ్ మరణించినట్లు ధ్రువీకరిస్తున్నాం. ఈ దారుణానికి పాల్పడిన వారిని గుర్తించేందుకు మా డిటెక్టివ్‌లు దర్యాప్తు చేస్తున్నారు” అని శాన్ జోక్విన్ షెరిఫ్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే, ఈ దాడి యాదృచ్ఛికంగా జరగలేదని, దుండగుల అసలు లక్ష్యం అవతార్ సింగ్ కాకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు. “వారు ఒక ప్ర‌త్యేక‌మైన‌ కారణంతో వేరొక వ్యక్తిని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ కారణం త్వరలోనే వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నాం” అని షెరిఫ్ పాట్రిక్ విత్‌రో స్థానిక మీడియాకు తెలిపారు.

ఇదిలా ఉండగా ఈ నెలలో అమెరికాలో భారత సంతతి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇది రెండోసారి. ఈ నెల‌ 9న అదృశ్యమైన సాకేత్ శ్రీనివాసయ్య (22) అనే భారత విద్యార్థి మృతదేహం బర్కిలీ హిల్స్‌లోని అంజా సరస్సులో లభ్యమైన విషయం తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు అవతార్ సింగ్ హత్య కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Another tragedy in America

You cannot copy content of this page

Scroll to Top