TRINETHRAM NEWS

Trinethram News : న్యూఢిల్లీ, డిసెంబర్‌ 9: ఆధార్‌ నమోదుకు అర్హత ఉన్న ఎవరైనా వారి చేతి ముద్రలు అందించలేకపోతే ఐరిస్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చునని కేంద్రం శనివారం ప్రకటించింది. తనకు చేతి వేళ్లు లేని కారణంగా ఆధార్‌లో పేరు నమోదు చేయించుకోలేక పోతున్నానంటూ కేరళకు చెందిన జోసిమల్‌ పీ జోస్‌ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్ర శేఖర్‌ స్పందించారు.జోసిమల్‌ విజ్ఞప్తిపై ఆ రోజే యూఐడీఏఐ అధికారులు కొట్టాయం జిల్లాలోని కొమరకంలో ఆమె ఇంటికి వెళ్లి ఆధార్‌ నెంబర్‌ను నమోదు చేయించారని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

జోసిమల్‌లా ఎవరికైనా చేతివేళ్లు లేకపోయినా, ఉన్నా వేలి ముద్రలు సరిగా పడకపోయినా, ఇతర ఏదైనా వైకల్యం కారణంగా ముద్రలు వేయలేకపోయినా ఇతర ప్రత్యామ్నాయ బయోమెట్రిక్‌ విధానాల ద్వారా వారి వివరాలు నమోదు చేసుకోవాలని అన్ని ఆధార్‌ సర్వీస్‌ కేంద్రాలకు సలహా జారీ చేసినట్టు ఆయన చెప్పారు.

వేలి ముద్రలు లభించని వారిని ఐరిస్‌ ద్వారా, ఐరిస్‌ నమోదు కాని వారి నుంచి వేలి ముద్రల ద్వారా బయోమెట్రిక్‌ నమోదు చేసుకుని ఆధార్‌ కార్డులు జారీ చేయాలని కేంద్ర మంత్రి చంద్రశేఖర్‌ ఆదేశించారు.