TRINETHRAM NEWS

బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చంద్రబాబు కృషి

మహిళల గౌరవం పెంచేందుకు మంత్రి లోకేష్ చర్యలు

ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్

44వ డివిజన్లో ఎన్టీ రామారావు విగ్రహావిష్కరణ‌

మహిళలకు చీరలు పంపిణీ
Trinethram News : రాజమహేంద్రవరం :సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని నినదించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. 44వ డివిజన్లో తెలుగు యువత నాయకులు వంజరపు శంకర్ నెలకొల్పిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆదివారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ పాల్గొన్నారు.

విగ్రహ ఆవిష్కరణ అనంతరం ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ సంక్షేమ పథకాలకు ఆద్యుడు అన్న నందమూరి తారక రామారావు అని కొనియాడారు. తెలుగువాడి సత్తా ప్రపంచానికి చాటిన మహా నాయకుడని పేర్కొన్నారు. రూ.2 కే కిలో బియ్యం, పేదలకు పెన్షన్లకు శ్రీకారం చుట్టారని, ఎన్టీఆర్ చూపిన బాటలో నడుస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు వాటిని కొనసాగిస్తున్నారని వివరించారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒకటొకటిగా నెరవేరుస్తోందని, దీపం పథకంలో మహిళలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామని, మే నెల నుంచి తల్లికి వందనం ద్వారా పిల్లలకు రూ.15 వేలు అందచేస్తారని చెప్పారు.

రాజమండ్రిలో వైసీపీ నాయకుడు ఎన్నికల ముందు ఓట్ల కోసం హడావిడిగా పట్టాలు ఇచ్చి మోసం చేశాడని విమర్శించారు. తాను మాత్రం త్వరలో కానవరంలోని స్థలంలో పదివేల పట్టాలకు చట్టబద్ధత కల్పించి ఇస్తానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు. సమాజంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మహిళలను గౌరవించాల్సిన అవసరం ఉందని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠ్యపుస్తకాలు మహిళలు మాత్రం ఇంటిపని, వంటపని చేస్తున్నట్లుగా ఉండే ఫోటోలే కాకుండా మగవారు కూడా ఆ పనులు చేస్తున్న ఫోటోలు ముద్రించేందుకు చర్యలు చేపట్టనున్నారని వివరించారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గం మహిళల‌ స్వయం ఉపాధికి 801 కుట్టు మిషన్లు మంజూరయ్యాయని, ఐదేళ్ళలో 4,000 కుట్టు మిషన్లు మహిళలకు అందచేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.

ఈ సందర్భంగా మహిళలకు చీరలు, ఐదుగురు అవసరార్థులకు బియ్యం అందచేశారు. టీడీపీ నగర ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య అధ్యక్షతన జరిగిన సభలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్ కుమార్, క్లస్టర్ ఇన్చార్జి కంటిపూడి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు పాలవలస వీరభద్రం, జవ్వాది విజయలక్ష్మి, పాలవలస బ్రహ్మాజీ, టీడీపీ నాయకులు మళ్ళ వెంకట్రాజు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

coalition government working