అటకెక్కిన నిరుద్యోగ భృతి..
ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదలలో జాప్యం
అబద్దపు ప్రచారంతో అధికారం: మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
విద్య వైద్య రంగాలను నీరు గారుస్తున్న కూటమి ప్రభుత్వం
సూపర్ సిక్స్ అమలు చేయకపోతే ఊరుకునేది లేదు : జక్కంపూడి రాజా
Trinethram News : రాజమహేంద్రవరం,మార్చి 9: ఫీజు రీయింబర్స్ మెంట్, నిరుద్యోగ భృతి అమలు పట్ల కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఈనెల 12వ తేదీన ‘యువత పోరు’ పేరిట కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయనున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు,మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా చెప్పారు.
పేదల అభ్యున్నతి కోసం నెలకొల్పిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుక సందర్బంగా ఆరోజు అన్ని మండలాల్లో వేడుకలు నిర్వహించిన ఆనంతరం కలెక్టర్ కార్యాలయం దగ్గర యువత పోరు ఆందోళన చేసి,వినతి పత్రం అందజేయనున్నట్లు వారు చెప్పారు.
విద్యార్థులు,యువత,తల్లిదండ్రులు పాల్గొనా లని కోరారు.యువత పోరు పోస్టర్ ను స్థానిక ప్రకాశంనగర్,కార్తికేయ ఎనక్లేవ్ లోని జక్కంపూడి రాజా నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ఆవిష్కరించారు.ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాల్, అడపా అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు ఫీజు రీఇంబర్స్మెంట్ చేయక పోవడం దారుణమని విమర్శించారు. నిరుద్యోగులకు 3 వేల రూపాయలు భృతి ఇస్తామని హామీ ఇచ్చి ఇంకా అమలు చేయలేదన్నారు.
ఎన్నికల ముందు ఇష్టం వచ్చినట్లు హామీలు గుప్పించి, అబద్ధపు ప్రచారంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రజలను పట్టించుకోవడం లేదని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నికల ముందు రాష్ట్రం మరో శ్రీలంక అయి పోతుందని,14లక్షల కోట్లు అప్పు అయిపోయిం దని ఇలా రకరకాలుగా అబద్ధపు ప్రచారం చేసి, తాము వస్తే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని చెప్పిన కూటమి నాయకులు తీరా అధికారంలోకి వచ్చాక తమ ధోరణి మార్చేశారని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు.
బడ్జెట్ ప్రవేశ పెట్టి అప్పుల సంగతి తేల్చాలని అడిగితె,వాస్తవాలు ఎక్కడ బయట పడతాయో నన్న భయంతో ఓట్ ఆన్ ఎక్కౌంట్ బడ్జెట్ పెట్టి కాలక్షేపం చేసారని, తాజాగా ప్రవేశ పెట్టిన బడ్జెట్ సందర్బంగా ప్రభుత్వ అప్పులు 4లక్షణాల 91వేల కోట్లు, కార్పొరేషన్ ల అప్పులు ఒక లక్షా 53వేలకోట్లు వెరసి 6లక్షల 46వేల 500కోట్ల రూపాయల అప్పులున్నటు ప్రభుత్వమే చెప్పిందని ఆయన గుర్తుచేశారు. మరి ఎన్నికల్లో 14లక్షల కోట్లు అప్పు అబద్ధ ప్రచారం ఎందుకు చేసారని ఆయన నిలదీశారు. పేద వర్గాలకు చెందిన,అణగారిన వర్గాలకు చెందిన పిల్లలు చదువుకుని అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫీజు రీ ఇంబర్స్ మెంట్ ప్రవేశపెట్టారని ఆయన గుర్తుచేశారు. ఈ పథకాన్ని నీరుగార్చాలని గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నించిందని,మళ్ళీ ఇప్పుడు అదే రీతిలో వ్యవహరిస్తోందని చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ విమర్శించారు. అసలు పేదలు చదువు కోవడం కూటమి ప్రభుత్వానికి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు.
తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేలు చొప్పున ఇస్తానని చెప్పిన చంద్రబాబు ఇంతవరకు ఎందుకు అమలుచేయలేదని చెల్లుబోయిన వేణు గోపాల కృష్ణ ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి అమ్మఓడి కొనసాగించడం ఇష్టంలేక పేరు మార్చారని అయినా సరే,అమలు చేయడం లేదని ఆయన విమర్శించారు.వాలంటీర్లను జగన్ మోహన్ రెడ్డి నియమించి రూ 5వేలు చొప్పున ఇస్తుంటే, పదివేలు చొప్పున ఇస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్ఛోక వలంటీర్ల వ్యవస్థను గాలికి వదిలేశారని ఆయన ధ్వజమెత్తారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, ఎన్నో హామీలు గుప్పించి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీలను నెరవేర్చక పోవడం దారుణమ న్నారు. అందుకే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందన్నారు.వాలంటీర్లకు 10వేలు వేతనం యిస్తామని చెప్పి, వాళ్ళను పట్టించుకోకుండా పక్కన పెట్టేయడం శోచనీయమన్నారు. మెగా డీఎస్సీకి తొలిసంతకం అని చెప్పి,ఇప్పటి వరకు డీఎస్సీ తీయలేదన్నారు. గ్రూప్ సి పరీక్షలకు సంబంధించి గందరగోళ పరిస్థితులు సృష్టించారని,ఇక నిరుద్యోగ భృతి కూడా అమలుచేయడం లేదని ఆయన విమర్శించారు. ఫీజు రీ ఇంబర్స్ మెంట్ అమలుచేయకపోవడం వలన విద్యార్థులు నానా బాధలు పడుతున్నా రని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగ భృతికి సంబంధించి బడ్జెట్ లో ప్రస్తావన లేదన్నారు.
వైసిపి హయాంలో ప్రభుత్వం తరపున మెడికల్ కాలేజీలను కట్టడం ప్రారంబిస్తే, కూటమి ప్రభుత్వం వాటిని ప్రయివేటు పరం చేయాలనీ చూస్తోందని ఆయన విమర్శించారు.
విద్య వైద్య రంగాలను కూటమి ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు.విద్యార్థులు,యువత సమస్యలను పరిష్కరించాలని,హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ 12వ తేదీన యువత పోరు పేరిట ఆందోళన చేపట్టినట్లు చెప్పారు.
ఎంతో గొప్పగా చెప్పిన సూపర్ సిక్స్ పథకాలను అమలు చేసి తీరాలని ఆయన జక్కంపూడి రాజా డిమాండ్ చేసారు.లేనిపక్షంలో ఊరుకునేది లేదన్నారు.ప్రజల్లో మరింత ఆందోళన తెస్తామన్నారు. అవసరమైతే మంత్రి లోకేష్ చెప్పినట్లు కాలర్ పట్టుకునే కాదు, జుట్టు పట్టుకుని కూడా ప్రజలు నిలదీస్తారని ఆయన హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


