జూలై 5, 2026
TRINETHRAM NEWS
Colorful world in the hands of children

గిరి బాల నేస్తం ఆధ్వర్యంలో 15 కేంద్రాల్లో 1050 పుస్తకాల పంపిణీ

Colorful World : అరకులోయ,మే 10, (త్రినేత్రం న్యూస్): పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందించేందుకు గిరి బాల నేస్తం ఆధ్వర్యంలో “పుస్తక వికాసం” కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. అరకు వ్యాలీ మండలం మాదల పంచాయతీ దాబుగూడ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో గిరి బాల నేస్తం జిల్లా కన్వీనర్ వి.వి. జయ మాట్లాడుతూ, మంచి పుస్తకం, కిడ్స్ లెర్న్ అండ్ హెల్ప్ సంస్థల సహకారంతో జిల్లాలోని 15 కేంద్రాల్లో మొత్తం 1050 పుస్తకాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరి బాల నేస్తం క్లబ్బులు, క్రియేటివ్ లెర్నింగ్ సెంటర్లకు ఒక్కో కేంద్రానికి 75 పుస్తకాలు చొప్పున అందజేస్తున్నామని, భవిష్యత్తులో వీటిని మినీ లైబ్రరీలుగా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఐదు నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలను దృష్టిలో పెట్టుకుని తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో రంగురంగుల చిత్రాలు, పెద్ద అక్షరాలతో పుస్తకాలను రూపొందించినట్లు వివరించారు.
పిల్లలను స్మార్ట్ ఫోన్ల నుంచి పుస్తకాల వైపు మళ్లించడం ప్రధాన ఉద్దేశమని వి.వి. జయ పేర్కొన్నారు. ప్రస్తుతం కథలు చెప్పే అమ్మమ్మలు, తాతయ్యలు అందుబాటులో లేకపోవడం, పిల్లలు చదువుకే పరిమితం కావడం, కలిసి ఆటలు ఆడే సంస్కృతి తగ్గిపోవడం, స్మార్ట్ ఫోన్లకే అలవాటు పడటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల నుంచి పిల్లలను బయటకు తీసుకువచ్చి పుస్తక పఠనం వైపు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గ్రామాల్లో మినీ లైబ్రరీలను ప్రారంభిస్తున్నామని తెలిపారు.
ఈ కార్యక్రమానికి పుస్తకాలు విరాళంగా అందించిన శివరామకృష్ణ, సి.వి. ప్రసాద్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ పుస్తకాలు పిల్లల ఊహాశక్తిని పెంపొందించడంతో పాటు సామాజిక స్పృహను కూడా పెంచుతాయని లెర్నింగ్ సెంటర్ నిర్వాహకుడు రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు.
పంపిణీ చేసిన పుస్తకాలలో “టింకు పెంకు”, “ఉక్రెయిన్ జానపద గాథలు”, “చింటూ బుజ్జి”, “పప్పు చారు”, “రెక్కల గుర్రం”, “అమ్మ ఏం అనదు”, “లెక్కల సారు” వంటి కథా పుస్తకాలు ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో శాంతి, నాగేంద్ర, మూర్తి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page