
Giri Bala Nestham Demands : అల్లూరి జిల్లా,అరకులోయ మార్చి 22 (త్రినేత్రం న్యూస్ ): ప్రవచనాల పేరుతో బాలలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావు పై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని గిరి బాల నేస్తం అల్లూరి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు అల్లూరి జిల్లా కన్వీనర్ వివి జయ విడుదల చేసిన పత్రిక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను “శోభనం కోసం పెళ్లికొడుకు”తో పోల్చడం అత్యంత అసభ్యకరమని, ఇది విద్యార్థుల గౌరవాన్ని దెబ్బతీసే వ్యాఖ్య అని ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులపై తక్కువ చేసి మాట్లాడటం, వారు కేవలం భోజనం కోసమే బడికి వస్తున్నారని చెప్పడం అమానవీయమని విమర్శించారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫార్ములు, మధ్యాహ్న భోజన పథకంపై అవహేళనగా మాట్లాడటం బాధాకరమని తెలిపారు. పేద విద్యార్థులకు ఈ పథకాలు ఎంతో మేలు చేస్తున్నాయని, డ్రాపౌట్ తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని గుర్తుచేశారు. స్వయంగా భారత సుప్రీంకోర్టు కూడా దేశవ్యాప్తంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని సూచించిందని, అలాంటి పథకాన్ని అవమానించడం న్యాయవ్యవస్థపట్ల గౌరవం లేనట్టే అని వ్యాఖ్యానించారు.
దేశంలో పెద్ద సంఖ్యలో పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్న ఈ సమయంలో, కోడిగుడ్డును కూడా తక్కువ చేసి మాట్లాడటం ఆకలిని కించపరచడమేనని తెలిపారు. విద్యార్థులకు భోజనం, పుస్తకాలు, యూనిఫార్ములు అందించడం ప్రభుత్వ బాధ్యత అని, దానిని “బిచ్చం”గా వ్యాఖ్యానించడం సిగ్గుచేటని అన్నారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకుని విద్యార్థులకు క్షమాపణ చెప్పాలని, అలాగే బాలల హక్కుల కమిషన్ కూడా ఈ అంశంపై జోక్యం చేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి గరికపాటి పై చర్యలు తీసుకోవాలని వివి జయ స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

