
- ప్రభుత్వ ఆసుపత్రి గోడ కూల్చి అక్రమంగా రోడ్డు నిర్మాణం
- స్థలాన్ని స్వయంగా పరిశీలించి ఆధారాలు, ఫోటోలు సేకరించినట్లు వెల్లడి
- నిజాలను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్న పల్లె శ్రీనివాస్ రెడ్డి (పల్లె వాసు)పై తీవ్ర విమర్శలు
- ప్రభుత్వ భూముల ఆక్రమణలో శ్రీనివాస్ రెడ్డి చరిత్రపై సంచలన ఆరోపణలు
- అక్రమ రోడ్డును వెంటనే తొలగించి ఆసుపత్రి గోడను పునర్నిర్మించాలని డిమాండ్
Dr. Satthi : త్రినేత్రం న్యూస్, బిక్కవోలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో జరిగిన అక్రమ కూల్చివేత ఘటనపై అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకుడి ఇంటి సౌకర్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రి గోడను కూల్చివేసి అడ్డంగా రోడ్డు నిర్మించడం ప్రజాస్వామ్యానికి మరియు ప్రభుత్వ ఆస్తులకు జరిగిన పెద్ద ద్రోహమని ఆయన మండిపడ్డారు. ఈ ఘటనపై తాము స్వయంగా సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలన నిర్వహించామని, అక్రమంగా నిర్మించిన రోడ్డుకు సంబంధించిన అన్ని ఆధారాలు మరియు ఫోటోలను సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రజల సేవకు ఉపయోగించాల్సిన ప్రభుత్వ ఆసుపత్రి భూమిని వ్యక్తిగత స్వార్థం కోసం వినియోగించడం అత్యంత దారుణమని ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
“ప్రజల ఆరోగ్య సేవల కోసం ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి స్థలాన్ని ప్రైవేటు అవసరాల కోసం వాడుకోవడం సిగ్గుచేటు. ఇలాంటి అక్రమాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోము” అని సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో నిజాలను కప్పిపుచ్చేందుకు ప్రయత్నిస్తున్న పల్లె శ్రీనివాస్ రెడ్డి (పల్లె వాసు) తీరును సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జంగా సుబ్బారెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలను ఖండించారు.
సుబ్బారెడ్డి స్థాయి ఏంటో, గతంలో ఆయన ముందు శ్రీనివాస్ రెడ్డి ఎలా ఉండేవారో గ్రామంలో అందరికీ తెలుసు” అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ స్థలాల ఆక్రమణపై మాట్లాడుతున్న శ్రీనివాస్ రెడ్డి స్వయంగా ప్రధాన రహదారి పక్కన ఉన్న చెరువు స్థలాన్ని ఆక్రమించి తన బంధువుల ద్వారా విక్రయించిన చరిత్ర ఉందని ఆరోపించారు. రాజకీయ కక్షతో సానుభూతిపరుల షాపులను తొలగించడం శ్రీనివాస్ రెడ్డి అరాచక పాలనకు నిదర్శనమని విమర్శించారు. కాకినాడలో తన వ్యాపార నష్టాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కారణమని చెప్పడం హాస్యాస్పదమని, అసలు విషయానికి వస్తే ఆయన ప్రవర్తన నచ్చక సొంత భాగస్వాములే బయటకు పంపించారని ఎద్దేవా చేశారు.
బిక్కవోలు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో అక్రమంగా నిర్మించిన రోడ్డును తక్షణమే తొలగించి, కూల్చివేసిన ఆసుపత్రి గోడను తిరిగి నిర్మించాలని డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమిని వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని కూడా సూచించారు. ప్రజల కోసం ఉన్న ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు ప్రయోజనాల కోసం వినియోగించే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరని, ఇప్పటికైనా అక్రమాలను సరిచేయకపోతే మరిన్ని వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాల్సి వస్తుందని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ఘాటుగా హెచ్చరించారు.

