DGP B. Shivadhar Reddy : గోదావరి పుష్కరాల భద్రత ఏర్పాట్లపై చర్యలు ప్రారంభించండి

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : గోదావరి పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చేపట్టవలసిన భద్రత ఏర్పాట్లపై తగిన చర్యలు తీసుకోవాలని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బి శివధర్ రెడ్డి అన్నారు. డిజిపి కార్యాలయంలో బుధవారం నాడు ఈ మేరకు వివిధ జిల్లాల పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎండోమెంట్ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యార్ తదితరులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో డిజిపి మాట్లాడుతూ….ఈ మహాత్కార్యక్రమానికి సంబంధించి భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, భక్తుల సౌకర్యాలపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ…. వచ్చే సంవత్సరం జూన్ 26 నుండి జూలై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలకు పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని సూచించారు. గోదావరి నది ప్రవహిస్తున్న జిల్లాల పోలీసు అధికారులు ఇప్పటి నుంచే పుష్కర పనులపై దృష్టి సారించాలని, ఏర్పాట్లను ముమ్మరం చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన మొదటి గోదావరి పుష్కరాల సమయంలో ఉమ్మడి జిల్లాలు ఉండేవని, ప్రస్తుతం జిల్లాల సంఖ్య పెరిగిన దృష్ట్యా క్షేత్రస్థాయిలో పనులపై అధికారులు సమగ్ర నివేదికలు తయారు చేయాలన్నారు. ఇటీవలి మేడారం జాతరలో వినియోగించిన సాంకేతిక నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఈ పుష్కరాల్లోనూ సమర్థంగా వాడాలని ఆయన సూచించారు.
ఈ పుష్కరాల సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ భారీ రద్దీని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలోని పుష్కరాల భద్రత ఏర్పాట్ల నిర్వహణలో ఈసారి అత్యాధునిక ‘ టెక్నాలజీ’ని పెద్ద ఎత్తున వినియోగించ వచ్చన్నారు. ప్రధానంగా సీసీ కెమెరాలు, ముఖ గుర్తింపు (ఫేషియల్ రికగ్నిషన్) వ్యవస్థ, వాహన నంబర్లను గుర్తించే ఏఎన్‌పీఆర్ కెమెరాలు, డ్రోన్ సర్వైలెన్స్ వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయాలన్నారు.

రద్దీని పర్యవేక్షించేందుకు వీడియో అనలిటిక్స్, హీట్ మ్యాప్స్ వంటి సాంకేతికతను జోడించి, స్టేట్ లెవల్ రియల్ టైమ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిరంతరం నిఘా ఉంచాలని,ప్రయాగ్రాజ్, నాశిక్ కుంభమేళాల తరహాలో వేలాది కెమెరాలతో పటిష్టమైన భద్రత కల్పించాలన్నారు. భక్తుల కోసం ప్రత్యేకంగా యూనిఫైడ్ మొబైల్ యాప్, డిజిటల్ డిస్ప్లే బోర్డులను అందుబాటులోకి తేవచ్చన్నారు.అత్యవసర సేవల కోసం అంబులెన్స్, ఫైర్ వాహనాల ట్రాకింగ్ సిస్టమ్ వంటి సదుపాయాలను సిద్ధం చేయాలన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న శైలజ రామయ్యార్ మాట్లాడుతూ…. గోదావరి నది ప్రవహిస్తున్న నిజామాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో అధికారులు పనులను ప్రారంభించాలన్నారు.నది నీటి నాణ్యతను, గాలి, శబ్ద కాలుష్యాన్ని ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసేలా వ్యవస్థలను ఏర్పాటు చేయాలన్నారు.

తాగునీటి నాణ్యత పర్యవేక్షణ, స్మార్ట్ బిన్స్, ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్ కలిగిన పారిశుద్ధ్య వాహనాలు తాత్కాలిక సోలార్ గ్రిడ్ వంటివి ఈ పుష్కరాల ప్రత్యేకత కానున్నాయన్నారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల అదనపు డిజిపి మహేష్ ఎం భగవత్, ఐ జి పి లు ఎస్.చంద్రశేఖర్ రెడ్డి, గజరావు భూపాల్, శాంతి భద్రతల ఏఐజి రమణ కుమార్, వివిధ జిల్లాల ఎస్పీలు ,కమిషనర్లు , ఎండోమెంట్ శాఖాధికారులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

security arrangements for Godavari Pushkaram

You cannot copy content of this page

Scroll to Top