అరకులోయ జనవరి 10, (త్రినేత్రం న్యూస్): అరకులోయ మండలంలోని శారద నికేతన్ పాఠశాలలో నిర్వహించిన సైన్స్ ఎక్స్‌పో కార్యక్రమం రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగింది.ఈ ఎక్స్‌పోను వీక్షించేందుకు గవర్నమెంట్ హై స్కూల్, బీవీకే కొండవీధి ప్రైమరీ స్కూల్, గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్‌లతో పాటు వివిధ పాఠశాలల నుంచి సుమారు 1000 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పరిసరాల ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
విద్యార్థులు ఏర్పాటు చేసిన సుమారు 300 ప్రదర్శనలు, వస్తుప్రదర్శనలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా గిరిజన సంప్రదాయాలు, సంస్కృతిని ప్రతిబింబించే విధంగా రూపొందించిన ప్రదర్శనలు అందరి మన్ననలు పొందాయి. గిరిజన జీవన విధానంలో వచ్చిన మార్పులు, వ్యవసాయ పద్ధతులు, పండగలు సోయిత్ పోరోబ్, హోల్ పొడ, కొరకోత వంటి పండుగలు, థింసా నృత్యం, చెట్లు పెంచడం వల్ల కలిగే లాభాలను విద్యార్థులు వివరించారు.
ఆచారాలు, విధానాలు, సంప్రదాయాలు ఉట్టిపడేలా రూపొందించిన ఈ ప్రదర్శనలు గిరిజన సాంస్కృతిక వారసత్వానికి అద్దం పట్టాయి.అలాగే ఇస్రోకు సంబంధించిన డయాగ్రామ్‌లను గీసి వాటి అవసరం, ప్రాముఖ్యతను విద్యార్థులు వచ్చిన అతిథులకు వివరించారు..అలాగే రెండు రోజులుగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు, కళారూపాలను దగ్గరుండి వీక్షించిన విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మయూరి సిల్క్ హౌస్ యజమాని బేత రాజారావు ఎగ్జిబిషన్‌ను సందర్శించి మాట్లాడుతూ, గిరిజన సంప్రదాయాలను అద్భుతంగా ప్రతిబింబించేలా విద్యార్థులు చేసిన ప్రదర్శనలు ఎంతో అభినందనీయమన్నారు.ఇలాంటి ప్రదర్శనలు ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదని, విద్యార్థుల సృజనాత్మకతకు హ్యాట్సాఫ్ అంటూ ప్రశంసలు కురిపించారు.పాఠశాల సిబ్బంది కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు.
నేటి ఆధునిక సమాజంలో గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు క్రమంగా కనుమరుగవుతున్న నేపథ్యంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు.గిరిజన వారసత్వాన్ని భావితరాలకు పరిచయం చేయడంలో ఈ సైన్స్ ఎక్స్‌పో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.అరకులోయ జడ్పీటీసీ కుటుంబ సభ్యులు, వైసీపీ సీనియర్ నాయకులు శెట్టి రోషిణి–అశోక్ కుటుంబ సభ్యులు ఎక్స్‌పోను సందర్శించి విద్యార్థులు రూపొందించిన డయాగ్రామ్‌లు, వాటి ప్రత్యేకతలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం విద్యార్థుల తెలివితేటలను అభినందిస్తూ, ఇలాంటి మంచి కార్యక్రమాల ద్వారా తమ ప్రతిభను వెలికితీయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చిరంజీవులు, బాబురావు, జగన్నాథం, పాఠశాల టీచర్స్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


