నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్..
ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.
అమరావతి: ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈ కోవలోకే వస్తారు. గత లోక్‌సభ ఎన్నికల్లో శ్రీకృష్ణదేవరాయలు వైసీపీ తరఫున నరసరావుపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆయన అక్కడి నుంచే పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఆయనను గుంటూరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి తెచ్చారు. శ్రీకృష్ణ దేవరాయలకు నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పారు. అయితే తాను గుంటూరు నుంచి అయితే పోటీ చేయనని, నరసరావుపేట నుంచి అయితనేనే పోటీ చేస్తానని, లేదంటే ఎన్నికల బరి నుంచి తప్పుకుంటానని శ్రీకృష్ణ దేవరాయలు వైసీపీ అధిష్టానానికి చెప్పారు. సీఎం జగన్ మాత్రం శ్రీకృష్ణ దేవరాయలు మాటను వినిపించుకోకుండా పంతానికి పోయారు.
కానీ ఐప్యాక్ సర్వేతో వైసీపీ అధిష్టానం మళ్లీ మనసు మార్చుకుంది. నరసరావు టికెట్‌పై రివర్స్ స్టాండ్ తీసుకుంది. శ్రీకృష్ణదేవరాయాలకే నరసరావుపేట ఎంపీ టికెట్ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో వైసీపీ అధిష్టానం ఆయనను బుజ్జగించే పనిలో పడింది. మొన్న వద్దన్నవారే నేడు బతిమాలాడుతున్నారు. ఇవ్వనన్న సీట్ మళ్లీ ఇస్తామని రమ్మంటున్నారు. వైసీపీ అధిష్టానంలో ఈ మార్పునకు ఐప్యాక్ ఇచ్చిన సర్వే రిపోర్టే కారణం. నరసరావుపేట ఎంపీ టికెట్ శ్రీకృష్ణదేవరాయాలకు ఇస్తేనే గెలుస్తామని ఐప్యాక్ సర్వేలో తేలింది. దీంతో నరసరావు పేట ఎంపీ నియోకవర్గ పరిధిలోని శాసనసభ్యులు అధిష్టానం వద్దకు వెళ్లి టికెట్ శ్రీకృష్ణదేవరాయాలకే ఇవ్వాలని సీఎంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో వెసీపీ అధిష్టానం మనసు మార్చుకుంది. నరసరావుపేట ఎంపీ సీటు బరిలో శ్రీకృష్ణదేవరాయాలనే ఉంచాలని నిర్ణయించింది. దీంతో ఆయనను ఒప్పించే పనిలో పడింది. అయితే మొదట తనకు నరసరావు పేట టికెట్ ఇవ్వనని చెప్పడంతో ప్రస్తుతం శ్రీకృష్ణదేవరాయలు ఆగ్రహంతో ఉన్నారు. దీంతో శ్రీకృష్ణదేవరాయాలను ఒప్పించేందుకు వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆయన వద్దకు క్యూకట్టారు. స్వయంగా ఎంపీ విజయసాయి రెడ్డి నుంచి నేతలు రాయబారం నడుపుతున్నారు. ఒకసారి సీఎం వద్దకు రావాలని శ్రీకృష్ణదేవరాయాలపై ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఆయన సీఎం వద్దకు వచ్చేందుకు నిరాకరించారు. గత రాత్రి శ్రీకృష్ణదేవరాయలు కుటుంబంతో కలిసి సినిమాకు వెళ్లారు. అక్కడ కూడా ఆయనను ఐప్యాక్ బృందం షాడోలా వెంటాడింది. చివరగా ఈ విషయంలో ఏం జరుగుతుందో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.