తిరుమల గోశాలలో టీడీపీ నేతలు- రోడ్డుపై వైసీపీ లీడర్లు- తిరుమలలో ఏం జరిగింది?
Trinethram News : తిరుపతి గోశాలపై రాజుకున్న రాజకీయ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. టీడీపీ నేతలు ఓవైపు, వైసీపీ నేతలు మరోవైపు పోటాపోటీగా గోశాలకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు చర్యలు తీసుకున్నారు. రెండు రోజులుగా నడుస్తున్న సవాళ్లను పరిగణలోకి తీసుకున్న పోలీసులు గుంపులు గుంపులుగా రావద్దని ఇప్పటికే హెచ్చరించారు. అయినా ప్రజాప్రతినిధులు గుంపులుగా వచ్చేందుకు యత్నించారు. దీంతో వారిని ఎక్కడికక్కడ నిలువరించారు.
టీటీడీ నిర్వహిస్తున్న గోశాలలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోయాయని వైసీపీ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణలు చేయడం వివాదం మొదలైంది. దీనిని కూటమి నేతలతోపాటు టీటీడీ కూడా ఖండించింది. సాక్ష్యాలు చూపించకుండా ఎక్కడెక్కడివో ఫొటోలు, వీడియోలతో తప్పుడుప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే గోశాలకు వచ్చి నిరూపించాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సవాల్ చేశారు. దీనికి భూమన కూడా ఓకే చెప్పారు.
ఇద్దరి మధ్య సవాళ్లు చేసుకోవడం ఇవాళ పది గంటలకు గోశాలకు వచ్చేందుకు ఇరు పార్టీల నేతలు ప్రయత్నించారు. టీడీపీ నేతలు ఒక్కొక్కరిగా వచ్చి గోశాలను సందర్శించి వెళ్లారు. అదే టైంలో వైసీపీ నేతలు వచ్చేందుకు యత్నించారు. పోలీసులు వారిని నిలువరించారు. ఒకేసారి వెళ్లి అక్కడ పరిస్థితి అదుపు తప్పేలా చేయొద్దని హితవు పలికారు. నేతలు ఎవరైనా గోశాలను సందర్శించుకోవచ్చని సూచించారు. కానీ అంతా ఒకేసారి వెళ్లి ఇబ్బంది పెట్టొద్దని పోలీసులు హితవు పలికారు.
కానీ వైసీపీ నేతలు మాత్రం శాంతి ర్యాలీ పేరుతో భారీ సంఖ్యలో గోశాలకు వెళ్లేందుకు యత్నించడం ఉద్రిక్తతకు దారి తీసింది. వారిని పోలీసులు అడ్డుకున్నారు. భూమన కరుణాకరరెడ్డి నివాసానికి ఎంపీ గురుమూర్తి, మాజీ మంత్రి నారాయణ స్వామి, ఇతర వైసీపీ లీడర్లు భారీగా చేరుకున్నారు. అక్కడి నుంచి ఎస్వీ గోశాలకు ర్యాలీగా వెళ్లేందుకు యత్నించారు. దీనినే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో నేతలు రోడ్డుపైనే బైఠాయించారు. కార్యకర్తలతో అక్కడ నిరసనకు దిగారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన భూమన… కూటమి నేతలు, టీటీడీపై విమర్శలు చేశారు. గోశాలకు వెళ్తున్న తమను అడ్డుకోవడం అన్యాయమని అన్నారు. ఎక్కడ నిజాలు వెలుగులోకి వస్తాయో అని ఇలా నిర్బంధించారని మండిపడ్డారు. వాళ్లే రమ్మని సవాల్ చేసి ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నించారు. టీడీపీ నేతలు గోశాల నుంచి వెళ్లిపోయిన తర్వాత అనుమతి ఇస్తే ఏం ప్రయోజనం అని నిలదీశారు.
భూమనను తామ అడ్డుకోలేదని పోలీసులు వివరణ ఇచ్చారు. నేతలు, వారి గన్‌మెన్‌లు గోశాలకు వెళ్లొచ్చని కానీ గుంపులుగా వెళ్లొద్దని మాత్రం సూచించినట్టు తెలిపారు. వైసీపీ నేతలను నిర్బంధించలేదని అరెస్టు కూడా చేయలేదని స్పష్టం చేశారు. గోశాలకు వాళ్లు ఎప్పుడైనా సింగిల్‌గా వెళ్లొచ్చని తేల్చి చెప్పారు.
ఈ సవాళ్లపై అటు టీడీపీ, ఇటు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్స్ విమర్శలు చేసుకున్నాయి. ఉదయం 10 గంటలకు తాము సిద్ధంగా ఉన్నామని గోశాలలో టీడీపీ నేతలు ఉన్న ఫొటోను టీడీపీ హ్యాండిల్ ట్వీట్ చేసింది. నిన్న సవాల్ చేసి నేడు పోలీసులతో తమ నేతలను అడ్డుకొని టీడీపీ నేతలు పారిపోయారని వైసీపీ వివర్శలు చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


