TRINETHRAM NEWS

Trinethram News : దిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోరుతూ ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల దిల్లీలో దీక్ష చేపట్టారు. ఏపీ భవన్‌లోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలతో కలిసి దీక్ష చేశారు..

ఈ సందర్భంగా షర్మిల మీడియాతో మాట్లాడారు. ”ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా కొనసాగిస్తామన్నారు. తిరుపతిలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఈ మాట చెప్పారు. విభజన చట్టంలోని హామీలను ఎందుకు ఇప్పటికీ నెరవేర్చలేదు” అని ప్రశ్నించారు.

”దుగరాజపట్నం పోర్టు నిర్మిస్తామన్నారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేస్తామని ప్రధాని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ప్రజలకు మాటిచ్చారు. ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని కాంగ్రెస్‌ పార్టీ, ఏపీ ప్రజల తరఫున నేను అడుగుతున్నా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. కేవలం ఓటు బ్యాంకు కోసం ఏవేవో మాయమాటలు చెప్పి.. వాటిలో ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. చివరకు విశాఖ స్టీల్‌ను ప్రైవేటీకరించాలని ప్రయత్నిస్తూ మరోసారి ఏపీ ప్రజలకు ద్రోహం చేయాలని చూస్తున్నారు” అని షర్మిల విమర్శించారు..

”ఏపీలో.. భాజపా ఒక్క ఎంపీ, ఒక్క ఎమ్మెల్యే స్థానంలో గెలవలేదు. అయినా ఆ పార్టీయే రాష్ట్రంలో రాజ్యమేలుతోంది. సీఎం జగన్‌ భాజపాకు గులాంగిరి చేస్తున్నారు. ఏపీ ప్రజలను మోదీకి బానిసలుగా చేసే ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట తప్పితే ద్రోహం చేసిన వారు అవుతారు. కచ్చితంగా ఈ విషయంలో ప్రజలకు మీరు సమాధానం చెప్పాలి. కేంద్రంలో ఉన్న భాజపా ఏపీ ప్రజలను పట్టించుకోవడం లేదు. అయినప్పటికీ వైకాపా ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత ముఖ్యమో అందరికీ తెలుసు. అయినా సరే అన్ని అంశాల్లో భాజపాకే మద్దతు ప్రకటిస్తున్నారు. మీ మధ్య ఉన్న ఒప్పందం ఏమిటో ప్రజలకు చెప్పాలి” అని షర్మిల డిమాండ్ చేశారు..