Minister Ponguleti : స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తాం

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నిర్ణయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడారు.

ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసిందని పొంగులేటి తెలిపారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ఠ నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది అని తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్‌కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది అని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ సారి రికార్డు స్థాయిలో వరి ధాన్యం సాగు అయింది. కేంద్ర సహకరించిన, సహకరించకపోయినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తాం. మద్దతు ధరతో పాటు రూ. 500 బోనస్ ఇస్తాం. రాష్ట్రంలో మూడు అగ్రికల్చర్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం.. ఈ మూడింటిని కొడంగల్, నిజామాబాద్, హుజుర్‌నగర్‌లో ఏర్పాటు చేసేందుకు కేబినెట్ ఆమోదించింది. మెట్రో సెకండ్ ఫేజ్‌పై కమిటీ ఏర్పాటు చేస్తామని పొంగులేటి పేర్కొన్నారు.

రాష్ట్రంలో హ్యామ్ మోడ్‌లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతామని మంత్రి పేర్కొన్నారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్‌పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది అని మంత్రి తెలిపారు.

కృష్ణా-వికారాబాద్ బ్రాడ్‌గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. మన్ననూర్‌-శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది అని మంత్రి పొంగులేటి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

We will remove the two-child rule

You cannot copy content of this page

Scroll to Top