అల్లూరి జిల్లా అరకులోయ ఫిబ్రవరి 14, (త్రినేత్రం న్యూస్)… అరకు వ్యాలీ మండలం బొండం గ్రామపంచాయతీ పరిధిలోని రంపుడు వలస గ్రామంలో తీవ్ర త్రాగునీటి సమస్య నెలకొంది. గ్రామంలో 53 కుటుంబాలు నివసిస్తున్నప్పటికీ, ఇప్పటికీ సురక్షితమైన త్రాగునీటి సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ విషయమై ఆదివాసీ గిరిజన సంఘం మండల కార్యదర్శి గత్తం బుజ్జి బాబు మాట్లాడుతూ, గ్రామంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన కరెంట్ బోరు నుండి వచ్చే నీరు నురగతో, దుర్వాసనతో రావడంతో త్రాగడానికి అనర్హంగా మారిందని తెలిపారు. దీంతో ఆ నీటిని గ్రామస్తులు ఉపయోగించడం లేదన్నారు.
ప్రస్తుతం గ్రామస్తులు గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన గ్రావిటీ పైపు లైన్ ద్వారా వచ్చే నీటిపైనే ఆధారపడుతున్నారని చెప్పారు. అయితే ఆ నీటికి సరైన స్టోరేజ్ ట్యాంక్ లేకపోవడంతో గ్రామంలోని అన్ని కుళాయి ట్యాపులకు నీరు అందడం లేదన్నారు. ప్రస్తుతం రెండు ట్యాపుల నుంచే నీరు వస్తుండటంతో, గ్రామంలోని అన్ని కుటుంబాలు అదే రెండు ట్యాపుల వద్ద నీరు పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.
దీంతో మహిళలు రోజూ గంటల తరబడి క్యూలో నిలబడి నీరు తెచ్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జల్ జీవన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన కుళాయి ట్యాపులు ప్రస్తుతం పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయని తెలిపారు. గడప గడపకు కుళాయి ట్యాపులు ఏర్పాటు చేయాల్సిన బదులు, అరకొరగా పైపు లైన్ వేసి, పంపు హౌస్ కూడా నిర్మించకుండా ఓపెన్ ఆన్-ఆఫ్ బోర్డు మాత్రమే పెట్టి వదిలేశారని ఆరోపించారు.
దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారని తెలిపారు. వేసవి కాలం సమీపిస్తున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో రంపుడు వలసలో తీవ్ర నీటి సంక్షోభం ఏర్పడే ప్రమాదం ఉందన్నారు.
గ్రావిటీ పైపు లైన్ ద్వారా వచ్చే నీటిని నిల్వ చేసేందుకు గ్రామంలో 5000 లీటర్ల సామర్థ్యంతో ప్లాస్టిక్ ట్యాంక్ ఏర్పాటు చేసి, గడప గడపకు కుళాయి ట్యాపులు అమర్చాలని ప్రభుత్వ అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ పి. సోమేశ్, ఎస్. దానియేలు, ఎస్. రామన్నతో పాటు గ్రామ మహిళలు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


