Trinethram News : దిల్లీ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఈసీ, ఈసీల నియామకాల (Election Commissioners) అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రధాన ఎన్నికల అధికారి (CEC), ఎన్నికల కమిషనర్ల (EC) నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్లు దాఖలయ్యాయి..
ఈ పిటిషన్ల అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) తాజాగా అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన సర్వోన్నత న్యాయస్థానం.. శుక్రవారం (మార్చి 15న) విచారణ జరుపుతామని వెల్లడించింది..
కేంద్ర ఎన్నికల సంఘం (EC)లో ఖాళీ అయిన కమిషనర్ల పోస్టులను ఈ నెల 15వ తేదీలోగా భర్తీ చేసేందుకు కేంద్రం సిద్ధమవుతున్న వేళ.. ఈ పరిణామం చోటుచేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల ఒక కమిషనర్ అనూప్ చంద్ర పాండే పదవీ విరమణ చేశారు. ఇటీవల మరో కమిషనర్ అరుణ్ గోయెల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఒక్కరే మిగిలారు..
ఏంటీ కొత్త చట్టం..?
ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీ నియామకాలు చేపట్టాలని 2023 మార్చిలో అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. అయితే, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి గతేడాది డిసెంబరులో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. ఈసీల నియామక బాధ్యతలను సెర్చ్, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చింది. దీన్ని సవాల్ చేస్తూనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి..