Mon. Mar 9th, 2026

Rahul Gandhi : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై రాహుల్ గాంధీ స్పందన

TRINETHRAM NEWS

తెలంగాణ పురపాలక ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘన విజయం

తమ సంక్షేమ పాలనకు లభించిన తీర్పు ఇదని రాహుల్ గాంధీ వ్యాఖ్య

116 మున్సిపాలిటీల్లో 64 కైవసం చేసుకున్న కాంగ్రెస్

గత ఎన్నికలతో పోలిస్తే భారీగా నష్టపోయిన బీఆర్ఎస్

కొన్ని కార్పొరేషన్లలో బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భావం

Trinethram News : తెలంగాణలో జరిగిన పురపాలక, నగరపాలక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. ఈ ఫలితాలు తమ సంక్షేమ పాలనకు, ప్రజల తెలంగాణ నమూనాకు ప్రజలు ఇచ్చిన ఆమోదమని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలిపారు. శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. ఈ విజయం కాంగ్రెస్ కార్యకర్తలు, తెలంగాణ ప్రజలదని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికీ అభివృద్ధి ఫలాలు అందించాలనే తమ ‘ప్రజల తెలంగాణ’ లక్ష్యం స్థిరంగా ఉంటుందని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలకు గాను కాంగ్రెస్ పార్టీ 64 చోట్ల జయకేతనం ఎగురవేసింది. అలాగే 7 కార్పొరేషన్లలో మూడింటిని కైవసం చేసుకుంది. మంచాల, రామగుండం, నల్గొండ కార్పొరేషన్లు హస్తం ఖాతాలో చేరాయి. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కేవలం 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లతో సరిపెట్టుకుంది. మరో 38 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ స్పష్టమైన ఆధిక్యం లభించలేదు. దీంతో ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ ఎన్నికల కోసం స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అప్పటి టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్) 100కు పైగా స్థానిక సంస్థలను గెలుచుకోగా, ఈసారి ఆ పార్టీ పనితీరు గణనీయంగా తగ్గింది. ఇక బీజేపీ సొంతంగా ఒక్క మున్సిపాలిటీని గెలవనప్పటికీ, తమ ఎంపీ స్థానాలైన కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.

మొత్తం 2,582 మున్సిపల్ వార్డులకు గాను కాంగ్రెస్ 1,347, బీఆర్ఎస్ 717, బీజేపీ 261 వార్డులను గెలుచుకున్నాయి. బుధవారం జరిగిన ఈ ఎన్నికల్లో 73 శాతానికి పైగా పోలింగ్ నమోదు కాగా, శుక్రవారం ఓట్ల లెక్కింపు ప్రక్రియను పూర్తిచేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Rahul Gandhi's response to Telangana municipal election results

Related Post

You cannot copy content of this page