Pod Taxis : హైదరాబాద్‌లో పాడ్ ట్యాక్సీలు.. మెట్రోకు అనుసంధానంగా కొత్త రవాణా

TRINETHRAM NEWS

హైదరాబాద్‌లో పీఆర్‌టీఎస్ పేరుతో కొత్త రవాణా వ్యవస్థ

మెట్రో స్టేషన్లకు అనుసంధానంగా పాడ్ ట్యాక్సీల ఏర్పాటు

ఐటీ కారిడార్, సచివాలయం పరిసరాల్లో తొలిదశ ప్రతిపాదన

సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కన్సల్టెన్సీకి టెండర్లు

పీపీపీ పద్ధతిలో ప్రాజెక్టును చేపట్టనున్న ప్రభుత్వం

Trinethram News : హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యను అధిగమించి, మెట్రో ప్రయాణికులకు మెరుగైన లాస్ట్-మైల్ కనెక్టివిటీ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలో ‘పర్సనలైజ్డ్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్’ (పీఆర్‌టీఎస్) లేదా పాడ్ ట్యాక్సీలను ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ ప్రాజెక్టు సాధ్యాసాధ్యాల అధ్యయనం కోసం కన్సల్టెంట్‌ను నియమించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) తాజాగా టెండర్లను ఆహ్వానించింది.

ముఖ్యంగా ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సచివాలయం వంటి రద్దీ ప్రాంతాల్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రాయదుర్గం, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ల నుంచి కార్యాలయాలకు సులభంగా చేరుకునేలా ఈ పాడ్ కార్లు ఉపయోగపడతాయి. మెట్రో స్టేషన్‌లో దిగిన తర్వాత కూడా ట్రాఫిక్‌లో చిక్కుకోకుండా, నేరుగా గమ్యస్థానాలకు చేరడం దీని ముఖ్య ఉద్దేశం.

ఈ పీఆర్‌టీఎస్ వ్యవస్థలో డ్రైవర్ లేకుండా, విద్యుత్‌తో నడిచే చిన్నపాటి కార్లు ఎలివేటెడ్ ట్రాక్‌లపై ప్రయాణిస్తాయి. ఒక్కో కారులో 4 నుంచి 8 మంది వరకు ప్రయాణించవచ్చు. ఈ ప్రాజెక్టును పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో ‘డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్’ (DBFOT) విధానంలో చేపట్టాలని హెచ్‌ఎంఆర్‌ఎల్ నిర్ణయించింది.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఈ ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అవి కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మెట్రో రెండో దశ విస్తరణతో పాటు ఈ పీఆర్‌టీఎస్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించింది. కన్సల్టెంట్ నియామకం కోసం జారీ చేసిన టెండర్లకు బిడ్లు దాఖలు చేసేందుకు మార్చి 25ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. కన్సల్టెంట్ ఇచ్చే నివేదిక ఆధారంగా తుది మార్గాలను ఖరారు చేయనున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pod taxis in Hyderabad

You cannot copy content of this page

Scroll to Top