Pakistan Air Force : అఫ్గానిస్థాన్‌లో పాక్ వైమానిక దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : పాక్ వాయుసేన శనివారం రాత్రి అఫ్గానిస్థాన్‌లో వైమానిక దాడులు నిర్వహించింది. పాక్-అఫ్గాన్ సరిహద్దు వెంబడి పలు ప్రాంతాలపై జరిగిన ఈ దాడుల్లో సుమారు 17 మంది మృతి చెందారు. ఉగ్ర మూకలు దాక్కున్న ప్రాంతాలపై ఈ దాడులు చేశామని పాక్ తెలిపింది.

వైమానిక దాడులను పాక్ సమాచార శాఖ మంత్రి అతావుల్లా తరార్ ఎక్స్ వేదికగా ధ్రువీకరించారు. నిఘా వర్గాల సమాచారం ఆధారంగా ఉగ్రవాదులకు సంబంధించిన ఏడు స్థావరాలపై పాక్ వైమానిక దాడి చేసిందని తెలిపారు. పాక్ తాలిబాన్లు, వారి స్థావరాలను టార్గెట్ చేసుకున్నామని చెప్పారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులపై కూడా పాక్ వైమానిక దాడులు చేసిందని అన్నారు.

అఫ్గానిస్థాన్‌లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ పాక్‌తో పొసగని విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో సరిహద్దు ఘర్షణల తరువాత పరిస్థితి మరింత దిగజారింది. పాక్‌లో ఆత్మాహుతి దాడులు కూడా కలకలం రేపుతున్నాయి. అఫ్గాన్ ప్రేరేపిత ఉగ్రవాదులే ఈ దాడులకు కారణమని పాక్ ఆరోపిస్తోంది.

శనివారం కూడా పాక్‌లోని ఖైబర్ పాఖ్‌తూన్‌ఖ్వా ప్రావిన్స్‌లో మరో ఆత్మాహుతి దాడి జరిగింది. ఓ మిలిటరీ కాన్వాయ్‌ను టార్గెట్ చేస్తూ జరిగిన దాడిలో లెఫ్టెనెంట్ కల్నల్, మరో సైనికుడు మరణించారు. ఆ తరువాత కొన్ని గంటలకే పాక్ అఫ్గాన్‌‌లో సరిహద్దు వెంబడి వైమానిక దాడులు చేసింది. ఇక తాలిబాన్లు మాత్రం పాక్ ఆరోపణలను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Pakistan Air Force conducts airstrikes in Afghanistan

You cannot copy content of this page

Scroll to Top