పత్రికా ప్రకటన
Trinethram News మచిలీపట్నం జనవరి 7 2024
ఈనెల 19వ తేదీన విజయవాడలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో ముందస్తుగా జన భగీదరి పేరుతో జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు.
విజయవాడ స్వరాజ్ మైదానంలో ఈనెల 19వ తేదీన 125 అడుగుల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కాంస్య విగ్రహము, స్మృతి వనము ఆవిష్కరణ కార్యక్రమం జరుగునుందన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విగ్రహ ఆవిష్కరణకు ముందుగా ఈనెల 9వ తేదీ నుండి 18వ తేదీ వరకు సంస్మరణ చేసుకుంటూ
జన భగీదరి కార్యక్రమాలను జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహించాల్సి ఉందన్నారు.
ఈ కార్యక్రమాలను సజావుగా నిర్వహించేందు కోసం జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు.
ఇందులో సంయుక్త కలెక్టర్ సభ్య కన్వీనర్ గా, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్, జిల్లా సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి,
మెప్మా డి ఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్లు, జిల్లా విద్యాధికారి సభ్యులుగా ఉంటారన్నారు.
ఇందులో భాగంగా గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో పౌరులను, స్థానిక ప్రజాప్రతినిధులను ఆహ్వానించి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఫ్లెక్సీ బ్యానర్ పై డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనిస్తామని మద్దతు తెలుపుతూ, ప్రతిజ్ఞ చేస్తూ ఫ్లెక్సీ బ్యానర్ పై సంతకం చేసేలా చూడాలన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ఒక్కో గ్రామం, వార్డు నుండి ప్రజలు 5 మంది ప్పాల్గొనేలా చైతన్య పరచాలన్నారు.
ఈ సందర్భంగా వారి గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాల్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలను శుద్ధిచేసి సుందరంగా తీర్చిదిద్ది పూలమాలలతో అలంకరించాలన్నారు.
అనంతరం భారత రాజ్యాంగం లోని ఉపోద్ఘాతంతో ప్రతిన పూనాలన్నారు.
అంతేకాకుండా ఎస్సీ కాలనీలలో సామాజిక న్యాయం పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
అలాగే జిల్లా స్థాయిలో జిల్లా కేంద్రంలో మారతాన్ పరుగు నిర్వహించాలని, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను తెలియజేసే ఛాయాచిత్ర ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు, నిర్వహించాలన్నారు.
అలాగే రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో సమావేశం నిర్వహించి విద్యావేత్తలు, సామాజిక న్యాయం కోసం పనిచేసే ప్రతినిధులు, సంస్థలను ఆహ్వానించాలన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆదర్శాలను, సామాజిక న్యాయానికి గుర్తుగా ఉన్న ప్రదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో మానవహారాన్ని ఏర్పాటు చేయాలన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో పాల్గొంటున్న వారి రాకపోకలకు సరైన ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు.
అంతేకాకుండా అన్ని పాఠశాలల్లో చిత్రలేఖనం, వ్యాసరచన, చర్చ కార్యక్రమాలు, క్విజ్ వంటి పోటీలను కూడా నిర్వహించాలన్నారు.