TRINETHRAM NEWS

పెట్రోల్‌బంక్‌లపై ఎగబడుతున్న వాహనదారులు.. ఎందుకంటే

Hyderabad Petrol Bunks: సిటీలో పెట్రోల్ టెన్షన్! నిలిచిపోయిన ఇంధన సప్లై – బంకుల్లో నో స్టాక్ బోర్డ్‌లు

Hyderabad Petrol Bunks News: హైదరాబాద్ లో రేపటి నుంచి రెండు రోజులపాటు పెట్రోల్ ట్యాంకర్ల సమ్మె చేస్తుండడంతో పెట్రోల్ బంకుల వద్ద బారులు తీరుతున్నారు.

ఇప్పటికే కొంత మంది సమ్మె చేస్తుండగా.. ఇంధన నిల్వలు నిండుకోవడంతో కొన్ని పెట్రోల్ బంకులు మూత పడ్డాయి. మిగిలిన కొన్ని బంకుల వద్ద వద్ద భారీగా క్యూ లైన్ లలో వాహనదారులు కనిపిస్తున్నారు.

త్వరలో సార్వత్రిక ఎన్నికలు ఉన్నందున పెట్రోల్, డీజిల్ రేట్లను కేంద్రం తగ్గిస్తుందనే ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. దీంతో చాలా వరకూ పెట్రోల్ బంక్ల యజమానులు.. పెట్రోల్, డీజిల్ ఫుల్ స్టాక్ ఉంచుకోలేదు. దీంతో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె చేస్తుండడంతో స్టాక్ ఉంచుకోని పెట్రోల్ బంకుల్లో ఇంధనం నిండుకుంది. బుధవారం నుంచి సమ్మె చేస్తానని ట్యాంకర్ల యజమానులు ముందుగానే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేపట్నుంచి పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో.. లేదోనని ఒక్కసారిగా వాహనదారులు బంక్లకు పోటెత్తారు. ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజిల్ అయిపోవడంతో నగరంలో చాలా చోట్ల పెట్రోల్ బంక్ల యజమానులు నో స్టాక్ అంటూ బోర్డులు తగిలిస్తున్నారు.

పార్లమెంటులో ప్రవేశపెట్టిన నూతన భారతీయ న్యాయసంహిత -2023 మోటారు వాహనాల హిట్ అండ్ రన్ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని లారీల డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. హిట్ అండ్ రన్ కేసులో రూ.7 లక్షల జరిమానా, పదేళ్ల జైలు శిక్షను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ట్రక్కు, ట్యాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె ప్రభావం పెట్రోల్ బంక్లపై పడ్తుంది. 3 రోజుల పాటు ఈ సమ్మె కొనసాగే అవకాశం ఉండడంతో పెట్రోల్ బంక్ల వద్ద జనం బారులు తీరారు.

సూర్యాపేట హెచ్పీసీఎల్ టెర్మినల్ వద్ద ఆయిల్ ట్యాంకర్స్ వర్కర్స్ అండ్ డ్రైవర్ల యూనియన్స్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నూతన చట్టం డ్రైవర్ల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని ఆరోపిస్తూ 200 ఇంధన ట్యాంకర్లను నిలిపివేసి లారీ డ్రైవర్లు ఆందోళన చేశారు. దీంతో ఇంధన సరఫరా నిలిచిపోయింది.