Konda Bitragunta Brahmotsavams : తిరుమల విధానంలో కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్: ఫిబ్రవరి 21 :నెల్లూరు జిల్లా : కొండ బిట్రగుంట… బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతనంగా నిర్మించిన రధశాల, కల్యాణ మండపాలకు కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి , శనివారం ప్రారంభోత్సవం చేశారు. ముందుగా ఆలయంలోని వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని, తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామి వారి కళ్యాణం కార్యక్రమంలో ఉభయకర్తలు బచ్చు కృష్ణ కుమార్ – సంధ్య దంపతులతోకలిసి ఎమ్మెల్యే దంపతులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిలకూట క్షేత్రంలో కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. బిట్రగుంటకు చెందిన బచ్చు కృష్ణ కుమార్ అమెరికాలో స్థిరపడి తన దాతృత్వాన్ని విద్యా, ధార్మిక కార్యక్రమాల రూపంలో కావలి నియోజకవర్గానికి అందిస్తున్నారని తెలిపారు.

కల్యాణ మండపం నిర్మాణానికి తాను ముందుకొచ్చి అవకాశం ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఈ రోజు భక్తుల సమక్షంలో ప్రారంభించడం జరిగిందన్నారు. ఆ దాత కుటుంబ సభ్యులందరికీ స్వామివారి ఆశీస్సులు మెండుగా ఉండాలని, దేవుని కృపతో మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కావలి నియోజకవర్గానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేసి కళ్యాణ మహోత్సవాన్ని విజయవంతం చేసినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 7వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల దేవస్థానంలో అమలు చేసే విధి విధానాల తరహాలోనే బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి దీవెనలు పొందాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో రాధాకృష్ణ, చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి, కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Konda Bitragunta Brahmotsavams in Tirumala system

You cannot copy content of this page

Scroll to Top