మొఘల్ రాజు బాబర్ నుంచి మోదీ వరకు.. అయోధ్యలో ఎప్పుడేం జరిగింది?…పూర్తి స్టోరీ తో..
1529లో బాబర్‌కు కానుకగా బాబ్రీ మసీదును నిర్మించిన మీర్‌బాకీ
1885లో మొదలైన వివాదం
1949 డిసెంబరు 22న బాబ్రీ మసీదులో కనిపించిన రాముడి విగ్రహం
1992 డిసెంబరు 6న బాబ్రీ మసీదు కూల్చివేత
17 ఏళ్ల ఆలస్యంగా ప్రధానికి నివేదిక ఇచ్చిన లిబర్‌హాన్ కమిషన్
2020 ఆగస్టు 5న అయోధ్య ఆలయ నిర్మాణానికి మోదీ శంకుస్థాపన
ఈ ఏడాది చివరినాటికి ఆలయ నిర్మాణం పూర్తి
*🚩రాయలసీమ ఎక్స్ ప్రెస్ న్యూస్🚩 *
జనవరి 22.. దేశం యావత్తు గుర్తుంచుకోదగిన రోజు. ఆ మాటకొస్తే చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతున్న రోజు. నేడు అయోధ్యలో జరగనున్న రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమంతో దేశంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ వేడుకను కనులారా చూడాలని దేశం నలుమూలల నుంచి ఇప్పటికే వేలాదిగా అయోధ్యకు చేరుకున్నారు. అసలు అయోధ్య రామయ్య మందిరానికి ఎందుకంత ప్రాధాన్యం? రామయ్య నడయాడిన అయోధ్యలో మళ్లీ పూజలందుకోబోతున్న శ్రీరామ చంద్రమూర్తికి సంబంధించి అయోధ్యలో ఎప్పుడేం జరిగిందన్నది ఓసారి చరిత్రను తిరగేసి చూద్దాం.
1526: పానిపట్ యుద్ధంలో ఇబ్రంహీం లోడీని ఓడించిన బాబర్ ఇండియాలో అడుగుపెట్టాడు. దీంతో మొఘలు సామ్రాజ్య పాలన ప్రారంభమైంది. అతడి జనరల్‌లలో ఒకరు ఈశాన్య భారతదేశాన్ని జయించిన సమయంలో 1528లో అయోధ్యలో పెద్ద మసీదును నిర్మించి దానికి బాబ్రీ మసీదుగా పేరు పెట్టి బాబర్‌ను ప్రసన్నం చేసుకున్నాడు. మసీదు వెలుపల హిందువులకు పూజించే వెసులుబాటు కల్పించారు.
1528: ఈ వివాదాస్పద స్థలంలో మసీదు నిర్మించాలని బాబర్ కమాండర్ మీర్‌బాకీ ఆదేశించాడు. అయితే, ఈ ప్రదేశం రాముడి జన్మస్థలమని, ఇక్కడ ఆలయం ఉందని హిందూ సమాజం పేర్కొంది. మసీదు గోపురాలలో ఒకదాని కింద రాముడి జన్మస్థలం ఉందని హిందువులు పేర్కొన్నారు.
1529: మీర్‌బాకీ ఈ మసీదును నిర్మించాడు.
1885: బాబ్రీ మసీదు విషయంలో చట్టపరమైన వివాదం మొదలైంది. మసీదును ఆనుకుని ఉన్న స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని కోరుతూ మహంత్ రఘుబీర్ దాస్ తొలిసారి కోర్టుకెక్కారు. అయితే దీనిని ఫైజాబాద్ జిల్లా మేజిస్ట్రేట్ తిరస్కరించారు. ఆ తర్వాత మసీదు ప్రాంగణం (చబుత్ర)పై ఆలయాన్ని నిర్మించేందుకు అనుమతి కోరుతూ భారత కార్యదర్శికి వ్యతిరేకంగా ఫైజాబాద్ కోర్టులో రఘుబీర్ దాస్ టైటిల్ దావా వేశారు. అప్పుడు కూడా ఆయనకు నిరాశే ఎదురైంది.
1949: డిసెంబరు 22న రాత్రి మసీదు లోపల రాముడి విగ్రహం కనిపించింది. అయితే, విగ్రహాన్ని రాత్రికి రాత్రే మసీదులో పెట్టారన్న వాదన కూడా ఉంది. రాముడి విగ్రహం కనిపించడంతో హిందువులు ప్రార్థనలు చేయడం ప్రారంభించారు. దీంతో ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని ‘కంటెస్టెడ్ ఏరియా’ (పోటీప్రాంతం)గా ప్రకటించి ప్రవేశాన్ని లాక్ చేసింది.
1950: హిందువుల వైపు నుంచి మరోమారు దావా వేశారు. గోపాల్ సిమ్లా విహరాద్, పరమహంస రామచంద్రదాస్ ఫైజాబాద్ కోర్టులో దావా వేస్తూ రాముడికి పూజలు చేసేందుకు అనుమతించాలని కోరారు. అందుకు సరేనన్న కోర్టు మసీదు లోపలి ప్రాంగణం గేట్లను మాత్రం మూసివేయాలని ఆదేశించింది.
1959: మసీదు భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ నిర్మోహి అఖాడా మూడో దావా వేసింది.
1961: బాబ్రీ మసీదు స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని కోరుతూ యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు దావా వేసింది. అంతేకాక, మసీదు నుంచి రాముడి విగ్రహాలను తొలగించాలని డిమాండ్ చేసింది.
1984: రామజన్మభూమి ఉద్యమం ప్రారంభమైంది. ఇందుకోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఓ బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే అద్వానీని ప్రచార సారథిగా నియమించింది.
1986( ఫిబ్రవరి 1): బాబ్రీ మసీదు లోపలి ద్వారాన్ని తెరిచారు. అయితే, గేట్లను తెరవాలని థర్డ్ పార్టీ న్యాయవాది యూసీ పాండే ఫైజాబాద్ సెషన్స్ కోర్టును కోరారు. అయితే, ఫైజాబాద్ జల్లా యంత్రాంగం మాత్రం గేట్లను మూసివేయాలని ఆదేశించింది.
1989 (నవంబర్ 9): వివాదాస్పద ప్రాంతంలో శంకుస్థాపనకు అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ వీహెచ్‌పీకి అనుమతినిచ్చారు.
1989: అన్ని టైటిల్ సూట్‌లు అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. 1959లో నిర్మోహి అఖాడా, 1961లో సున్నీ వక్ఫ్ బోర్డును దావాలలో ప్రతివాదులుగా పేర్కొంటూ రామ్‌లల్లా విరాజ్‌మాన్ పేరిట హైకోర్టులో మరో దావా దాఖలైంది.
1990 (సెప్టెంబరు 25): ఆలయ ఉద్యమానికి మద్దతు కోరుతూ గుజరాత్‌లోని సోమనాథ్ నుంచి యూపీలోని అయోధ్య వరకు ఎల్‌కే అద్వానీ రథయాత్ర ప్రారంభించారు. ఇది మతహింసకు దారితీసింది.
1992 (డిసెంబరు 6): దేశం నలుమూలల నుంచి అయోధ్య చేరుకున్న కరసేవకులు బాబ్రీ మసీదును ధ్వంసం చేశారు.
1992 (డిసెంబరు 16): మసీదు కూల్చివేసిన పది రోజుల తర్వాత అప్పటి ప్రధాని హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ లిబర్‌హాన్ నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేశారు. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
1993 (జనవరి 7): అయోధ్య భూమి ప్రభుత్వ స్వాధీనం అయింది. పీవీ నరసింహారావు సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం 67.7 ఎకరాల భూమి (మసీదు స్థల, పరిసర ప్రాంతాలు)ని స్వాధీనం చేసుకున్నట్టు ప్రకటిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆ తర్వాత ఇది చట్టబద్ధమైంది.
1993 (ఏప్రిల్ 3): చట్టంలోని వివిధ అంశాలను సవాలు చేస్తూ ఇస్మాయిల్ ఫరూఖీ సహా మరికొందరు అలహాబాద్ హైకోర్టులో రిట్‌పిటిషన్లు వేశారు. ఆర్టికల్ 139 ఎ ప్రకారం సుప్రీంకోర్టు తన అధికార పరిధిని అమలు చేస్తూ హైకోర్టులో పెండింగులో ఉన్న రిట్ పిటిషన్లను బదిలీ చేసింది.
1994: ప్రభుత్వం అయోధ్య స్థలాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని సుప్రీంకోర్టు 3:2 మెజారిటీతో సమర్థించింది. ఏదైనా ప్రాముఖ్యత ఉంటే తప్ప మసీదులో నమాజ్ చేయడం ఇస్లాంలో అంతర్భాగం కాదని తేల్చి చెప్పింది. అయితే, ఈ తీర్పుపై విమర్శలు వెల్లువెత్తాయి.
2002 (ఏప్రిల్): అయోధ్య టైటిల్ వివాదం కేసు మళ్లీ మొదలైంది. అలహాబాద్ హైకోర్టులోని లక్నో బెంచ్ కేసు విచారణ ప్రారంభించింది.
2003 (మార్చి-ఆగస్టు): అలహాబాద్ హైకోర్టు ఆదేశాల మేరకు వివాదాస్పద స్థలం కింద ఉన్న భూమిలో ఆర్కియాలాజికల్ సర్వే ప్రారంభమైంది. ఈ సందర్భంగా అక్కడ పదో శతాబ్దంనాటి హిందూ దేవాలయ అవశేషాలను గుర్తించారు. అయితే, ఆర్కియాలాజికల్ సర్వే నివేదికను ముస్లింలు ప్రశ్నించారు.
2009 (జనవరి 30): 17 ఏళ్ల జాప్యం తర్వాత లిబర్‌హాన్ కమిషన్ ప్రధానికి నివేదిక సమర్పించినా, అందులోని విషయాలను బహిర్గత పర్చలేదు.
2010( సెప్టెంబర్ 30): అయోధ్య భూమిని అలహాబాద్ హైకోర్టు మూడు భాగాలుగా విభజించి మూడు పక్షాలకు పంచుతూ తీర్పు చెప్పింది. ఒకవంతును సున్నీ వక్ఫ్ బోర్డుకు, మరో వంతు నిర్మోహి అఖాడాకు, ఇంకో వంతును రామ్‌లల్లా విరాజ్‌మాన్‌కు పంచింది.
2011 (మే): అలహాబాద్ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అన్ని పార్టీలు దాఖలు చేసిన పిటిషన్ బ్యాచ్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. విభజన కోసం ఏ పార్టీ కూడా కోరనప్పుడు డిక్రీని ఎలా ఆమోదించాలని ప్రశ్నించింది.
2017 (మార్చి 21): కోర్టు బయట అన్ని పార్టీలు కలిసి చర్చించుకోవాలని మాజీ సీజే ఖేహార్ సూచించారు.
2017 (ఆగస్టు 11): సుప్రీంకోర్టులోని త్రిసభ్య బెంచ్ విచారణను తిరిగి ప్రారంభించింది.
2018( ఫిబ్రవరి-జులై) 1994 నాటి ఇస్మాయిల్ ఫరూఖీ తీర్పు పునర్విచారణ కోసం ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి సూచించాలని పిటిషనర్లు కోరారు.
2018(జులై 20): విస్తృత ధర్మాసనానికి సూచించాలన్న అప్పీలుపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది.
2018 (సెప్టెంబర్ 2): పెద్ద బెంచ్ ఏర్పాటుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 1994 నాటి ఇస్మాయిల్ ఫరూఖీ తీర్పును పునః పరిశీలించాల్సిన అవసరం లేదని ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ 2:1తో తీర్పు చెప్పింది.
2019(జనవరి 8): ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ ఏర్పాటు చేశారు.
2019(మార్చి 8): మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. రెండు రోజుల విచారణ తర్వాత కొన్ని కీలక పక్షాలు అభ్యంతరం వ్యక్తం చేసినప్పటకీ కోర్టు పర్యవేక్షణలో రాజ్యాంగ ధర్మాసనం మధ్యవర్తిత్వం వహించాలని ఆదేశించింది.
2019 (డిసెంబరు 12): అయోధ్య భూవివాం కేసు తీర్పుపై ఎలాంటి మెరిట్‌లు లేకపోవడంతో దానిని సమీక్షించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
2020(ఫిబ్రవరి 5): వివాదాస్పద స్థలంలో రామ మందిర నిర్మాణాన్ని పర్యవేక్షించేందుకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం ఆమోదించింది. ఈ మేరకు ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించారు.
2020 (ఫిబ్రవరి 24): అయోధ్యలోని సోహవాల్ తహసీల్‌లోని ధన్నీపూర్ గ్రామంలో మసీదు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమిని తీసుకునేందుకు ఉత్తరప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు అంగీకరించింది.
2020 (మార్చి 25): 28 ఏళ్ల తర్వాత రామ్ లల్లా విగ్రహాలను తాత్కాలిక ఆలయం నుంచి ఫైబర్ ఆలయానికి మార్చారు. ఆగస్టు 5న ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది.
2020 (ఆగస్టు 5) ప్రధానమంత్రి నరేంద్రమోదీ రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆరు నెలలు, లేదంటే ఏడాది లోపల నిర్మాణాన్ని పూర్తిచేస్తామని ట్రస్ట్ పేర్కొంది.
2023 (అక్టోబరు 25): రామమందిరాన్ని ప్రారంభించేందుకు ప్రధాని మోదీని రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానించింది.
2024( జనవరి 22): ప్రధాని మోదీతోపాటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ గర్భగుడిలోకి వెళ్లి పూజాకార్యక్రమాలు పర్యవేక్షిస్తారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి 7 వేలమందిని ఆహ్వానించారు. వీరిలో పలువురు రాజకీయ నాయకులు, మతపెద్దలు, సెలబ్రిటీలు, పూజారులు ఉన్నారు.
2024(జనవరి 22): ఇప్పటి వరకు ఆలయం నిర్మాణం మొదటి దశ మాత్రమే పూర్తయింది. ఇందులో రెండు గర్భాలయాలు ఉన్నాయి. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఐదేళ్ల వయసున్న 51 అంగుళాల రామ్ లల్లా విగ్రహాన్ని స్థాపించి ప్రతిష్ఠిస్తారు. ఆలయ రెండోదశ నిర్మాణంలో ఉంది. గ్రౌండ్‌ఫ్లోర్‌తోపాటు రెండంతస్తులు, ఐదు మండపాలను ఈ ఏడాది చివరి నాటికి పూర్తిచేయాలని నిర్ణయించారు. సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడి విగ్రహాలు ఆలయం మొదటి అంతస్తులో ప్రతిష్ఠిస్తారు.