రూ.4.2 కోట్లతో నిర్మాణం – 5 వేల గృహాలు, 420 వ్యవసాయ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా.
Electricity Substation : త్రినేత్రం న్యూస్ : నందిగామ నియోజకవర్గం అంబారుపేటలో నిర్మించబడనున్న 33/11 కేవీ విద్యుత్ సబ్-స్టేషన్ శంకుస్థాపన మహోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య మాజీ మంత్రివర్యులు వసంత నాగేశ్వరరావు కూటమి నేతలు మరియు అధికారులతో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా తంగిరాల సౌమ్య మాట్లాడుతూ అంబారుపేట ప్రాంత ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించేందుకు ఈ సబ్-స్టేషన్ కీలకంగా మారుతుందని తెలిపారు. ఈ సబ్-స్టేషన్ నిర్మాణానికి వాడ్కో ద్వారా నిధులు సమకూర్చినట్లు చెప్పారు. మొత్తం రూ.4.2 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించారు.
ఈ సబ్-స్టేషన్ ద్వారా మూడు కొత్త ఫీడర్లు ఏర్పాటు చేయబడనున్నాయని, దీనివల్ల అంబారుపేట, ఐతవరం, కంచెల మరియు కేతవీరునిపాడు గ్రామాలకు చెందిన సుమారు 5000 గృహ వినియోగదారులు మరియు 420 వ్యవసాయ విద్యుత్ వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. అలాగే పరోక్షంగా నందిగామ పట్టణంలోని ముక్కపాటి కాలనీ, రైతుపేట, రైతుపేట డౌన్ మరియు చందాపురం ప్రాంతాలలోని సుమారు 4500 గృహ వినియోగదారులకు కూడా లో వోల్టేజ్ సమస్య తగ్గి మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని తెలిపారు.
కృష్ణా నది వరద ప్రవాహం సమయంలో కూడా అన్ని గ్రామాలకు నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించడానికి ఈ కొత్త సబ్-స్టేషన్ ఉపయోగపడుతుందని తంగిరాల సౌమ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి పిట్టల శ్రీదేవి,గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, అంబారుపేట సత్యమ్మ తల్లి దేవాలయ చైర్మన్,ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.


