జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Ebola commotion in Hyderabad

మరో ఇద్దరు గాంధీ ఆసుపత్రికి తరలింపు

Ebola : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్, మే 5: హైదరాబాద్‌లో ఎబోలా వైరస్ కలకలం రేపుతోంది. అనుమానిత ఎబోలా లక్షణాలతో మరో ఇద్దరు వ్యక్తులు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఇప్పటివరకు ఈ వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు చేరిన వారి సంఖ్య ముగ్గురికి చేరింది. ఈ రోజు తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు ఎబోలా లక్షణాలతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రికి వెళ్లారు. వారిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక లక్షణాల ఆధారంగా ఎబోలాగా అనుమానించారు. బాధితులను తక్షణమే మెరుగైన చికిత్స, ప్రత్యేక నిఘా కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. కాగా, నిన్ననే మరో వ్యక్తిని కూడా ఇలాంటి లక్షణాలతోనే గాంధీ ఆసుపత్రికి తరలించిన సంగతి తెలిసిందే.

వైద్య ఆరోగ్య శాఖ అధికారులు జరిపిన ప్రాథమిక విచారణలో ఒక కీలక విషయం వెలుగుచూసింది. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురు అనుమానితులు కూడా విదేశాల నుంచి ఒకే ఫ్లైట్‌లో హైదరాబాద్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ముగ్గురు బాధితులు ఒకే విమానంలో ప్రయాణించారనే విషయం తేలడంతో వైద్య నిపుణులు, ఎయిర్‌పోర్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. సదరు ఫ్లైట్‌లో ప్రయాణించిన మిగతా ప్రయాణికుల వివరాలను సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. వారిలో ఎవరికైనా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అనే కోణంలో ట్రాక్ చేస్తున్నారు.

ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చేరిన ముగ్గురికీ ప్రత్యేక ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. వీరి రక్త నమూనాలను సేకరించి, తుది నిర్ధారణ కోసం పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (NIV) కి పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, అధికారులు అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారని వైద్య వర్గాలు తెలిపాయి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page