ఉగాండాలో పెరిగిపోయిన డీఎన్ఏ పితృత్వ పరీక్షలు
ఫలితాలతో విచ్ఛిన్నమవుతున్న కుటుంబాలు, పెరుగుతున్న హింస
ఈ పరీక్షలు వద్దంటూ హితవు పలుకుతున్న మత, సంప్రదాయ పెద్దలు
ఆస్తి పంపకాలు, విడాకుల సమయంలో పెరుగుతున్న వివాదాలు
బలహీన మనస్కులు ఈ టెస్టులకు దూరంగా ఉండాలన్న ప్రభుత్వం
Trinethram News : తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో డీఎన్ఏ పితృత్వ పరీక్షలు ఓ సామాజిక సంక్షోభానికి దారితీస్తున్నాయి. పిల్లలు తమ పోలికలతో లేరనే అనుమానంతో పురుషులు చేయించుకుంటున్న డీఎన్ఏ టెస్టుల ఫలితాలు కుటుంబాలను ఛిద్రం చేస్తున్నాయి. ఈ వివాదాలు కొన్నిసార్లు హింసకు దారితీసి, పెళ్లిళ్లు విఫలమయ్యే వరకు వెళ్తున్నాయి. దీంతో మత, సంప్రదాయ పెద్దలు రంగంలోకి దిగి, సంయమనం పాటించాలని కోరుతున్నారు.
ఇటీవల కాలంలో ఉగాండాలో స్వచ్ఛందంగా డీఎన్ఏ పరీక్షలు చేయించుకుంటున్న పురుషుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, ఫలితాలు హృదయవిదారకంగా ఉంటున్నాయని ఆ దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. “టెస్టులు చేయించుకుంటున్న వారిలో 95 శాతం పురుషులే. కానీ, 98శాతం కేసుల్లో ఆ పిల్లలు వారి సొంత సంతానం కాదని తేలుతోంది. గుండె ధైర్యం ఉంటే తప్ప ఈ పరీక్షలు చేయించుకోవద్దు” అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి సైమన్ పీటర్ ముండేయ్ హెచ్చరించారు.
ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసిన ఉగాండా ఆంగ్లికన్ ఆర్చ్ బిషప్ స్టీఫెన్ కజీంబ, గత క్రిస్మస్ ప్రసంగంలో ఈ అంశాన్ని లేవనెత్తారు. ఏసుక్రీస్తు జననాన్ని ప్రస్తావిస్తూ.. “జోసెఫ్ మాదిరిగా పిల్లలు ఎవరైనా వారిని సొంత బిడ్డల్లాగే చూసుకోవాలి. డీఎన్ఏ టెస్టుల జోలికి వెళ్లవద్దు” అని ఆయన హితవు పలికారు.
స్థానిక గిరిజన నాయకుడు మోసెస్ కుటోయ్ వంటి సంప్రదాయ పెద్దలు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తన దగ్గరకు వచ్చే కుటుంబ వివాదాలను పరిష్కరించే క్రమంలో, “నేను కూడా మా నాన్న పోలికలతో ఉండను” అని ఆయన ఉదాహరణగా చెబుతున్నారు. పూర్వం పిల్లల పితృత్వాన్ని శంకించడం పెద్ద నేరమని, అలా మాట్లాడిన వారికి జరిమానా విధించేవారని ఆయన గుర్తుచేశారు. ఆస్తి పంపకాలు, విడాకుల సమయంలోనే ఈ వివాదాలు ఎక్కువగా తలెత్తుతున్నాయని ఏపీ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది.
ఉగాండాలో డీఎన్ఏ టెస్టింగ్ సెంటర్లు విరివిగా వెలవడంతో పాటు, వాటి ప్రకటనలు రేడియోలు, ట్యాక్సీలపై కూడా కనిపిస్తున్నాయి. అయితే, ఫీజు సుమారు 200 డాలర్లకు పైగా ఉండటంతో చాలామందికి ఇది అందుబాటులో లేదు. ఏదేమైనా, ఇంట్లో పుట్టిన బిడ్డ కుటుంబానికే చెందుతాడని, వారిని నిరాకరించడం తమ సంప్రదాయంలో లేదని పెద్దలు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ఆఫ్రికా సంప్రదాయం ప్రకారం మహిళ తన భర్తకు సంతానాన్ని కని ఇవ్వకపోతే విడాకులు ఇవ్వడం లేదా ఆమెను ఇంటి నుంచి బయటకు పంపడం చేసే వారు. చాలా కేసుల్లో పురుషుల్లోనే సంతాన సమస్యలు ఉన్నా, శిక్ష మాత్రం తమకు పడుతుండటంతో చాలా మంది మహిళలు ఇతరులతో కలిసి పిల్లలను కంటున్నారని ఓ అధికారి వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


