
సుమారు 6 వేల మందికి పైగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం
Divyang Shakti : అల్లూరి సీతారామరాజు జిల్లా మార్చి 19, (త్రినేత్రం న్యూస్): దివ్యాంగుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘దివ్యాంగ శక్తి’ పథకాన్ని జిల్లా కలెక్టర్ ఏ ఎస్ దినేష్ కుమార్ మరియు మాజీ శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి బుధవారం ఘనంగా పాడేరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సుకు పచ్చజెండా ఊపి సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా సుమారు 6 వేల మందికి పైగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల ఆర్థిక భారం తగ్గించడం, వారి సామాజిక భద్రతను బలోపేతం చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఇప్పటివరకు నాలుగు రకాల దివ్యాంగులకు మాత్రమే ఈ సౌకర్యం ఉండగా, ప్రస్తుతం 21 రకాల దివ్యాంగులకు విస్తరించినట్లు తెలిపారు. వీరితో పాటు ప్రయాణించే సహాయకులకు 50 శాతం రాయితీతో ప్రయాణించే అవకాశం కల్పించబడిందన్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని వివరించారు. ఇంకా బస్సు పాస్ పొందని అర్హులైన దివ్యాంగులు సదరం సర్టిఫికేట్, ఆధార్ కార్డు, రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో సంబంధిత ఆర్టీసీ డిపో మేనేజర్‌కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అర్హతలను పరిశీలించి ఉచిత బస్ పాస్ మంజూరు చేస్తామని తెలిపారు. దివ్యాంగులకు కేటాయించిన సీట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.
మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మాట్లాడుతూ, గతంతో పోలిస్తే ప్రస్తుతం మరింత విస్తృతంగా దివ్యాంగులకు ఈ సౌకర్యం కల్పించడం సంతోషకరమని అన్నారు. ఈ పథకం ద్వారా ప్రయాణ ఖర్చు తగ్గి, ఆర్థికంగా ఉపశమనం లభిస్తుందని తెలిపారు. బస్సు ప్రారంభోత్సవం అనంతరం కలెక్టర్ మరియు మాజీ ఎమ్మెల్యే బస్సులో టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులను వారి గమ్యస్థానాలకు చేరుకునే విధంగా బస్సు ఏర్పాట్లు చేశారు.
ఈ పథకం అమలు పట్ల లబ్ధిదారులు ప్రభుత్వానికి, జిల్లా యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రజా రవాణా అధికారి పి. శ్రీనివాసరావు, ఏపీఎస్ఆర్టీసీ యూనియన్ నాయకులు చందు, ప్రసాదరావు, ఇతర రవాణా శాఖ అధికారులు, ఏపీ సీఎస్ చైర్మన్ డి. వెంకట్రావు, మాజీ ఎంపీపీ బుర్ర విజయరాణి, దివ్యాంగుల సంక్షేమ శాఖ ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

