Dialysis services for patients through single use filter
డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు
*సింగల్ యూజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు
*రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల స్టాక్ ముందస్తుగా అందుబాటులో ఉండాలి
*మంథని ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి
మంథని, ఆగస్టు – 21: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇన్ ఫేక్షన్ వచ్చే ప్రమాదం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉంటూ పారిశుధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు సూచించారు.
బుధవారం రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంథని ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ హర్ష తో కలిసి ప్రారంభించారు.
ఆసుపత్రిలోని డయాలసిస్ కేంద్రంలో అమర్చిన పరికరాలు, రోగులకు అందించే సేవలు తదితర వివరాలను మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, మంథని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని మంజూరు చేసి ఏర్పాటుచేసిన రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా ఉండేలా వైద్యులు సంబంధిత అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని మంత్రి ఆదేశించారు.
డయాలసిస్ కోసం ప్రజలు దూరప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా మంథనిలోనే అందుబాటులోకి రావడం చాలా సంతోషకరమని, అదేవిధంగా మహాదేవపూర్ ఆసుపత్రిలో కూడా ఐదు పడకల డయాలసిస్ కేంద్రం రోగులకు సేవలు అందిస్తుందని మంత్రి తెలిపారు.
దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా మన తెలంగాణలో సింగిల్ యూసెజ్ ఫిల్టర్ ద్వారా రోగులకు డయాలసిస్ సేవలు అందిస్తున్నామని అన్నారు. డయాలసిస్ సేవలు అందుకుంటున్న రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల స్టాక్ ముందస్తుగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.
గుంజపడుగు గ్రామంలో వైరల్ జ్వరాల కేసులు అధికంగా ఉన్నాయని మంత్రి తెలుసుకున్నారు. గుంజపడుగు గ్రామంలో ప్రత్యేక హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయాలని ఇంటింటికి సర్వే చేపట్టి అవసరమైన పరీక్షలు నిర్వహించాలని మంత్రి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు.
ఎంపి గడ్డం వంశీ కృష్ణ మాట్లాడుతూ మంథని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కావడం చాలా సంతోషకరమని, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో తన వంతు సంపూర్ణ సహకారం అందజేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ రమ, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమా నాయక్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, మంథని ఆసుపత్రి సూపరింటెండెంట్, ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App