సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
BRS Launches Campaign

ప్రజా సమస్యలు, హామీల అమలులో వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
– దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్

BRS Launches Campaign : దేవరకొండ డివిజన్ ఆగస్టు 29, త్రినేత్రం న్యూస్. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ పార్టీ చేపట్టనున్న వారం రోజుల పోరుబాటను విజయవంతం చేయాలని దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బీఆర్‌ఎస్‌ దేవరకొండ నియోజకవర్గ ఇంచార్జి రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శనివారం దేవరకొండ పట్టణంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…….ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను ప్రజలకు గుర్తుచేస్తూ, వెయ్యి రోజులు గడిచినా అమలు కాని హామీలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని సూచించారు.కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణలను ప్రజల ముందుంచి ప్రభుత్వాన్ని నిలదీయాలని పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
సెప్టెంబర్ 2 – ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ధర్నాలు….. నియోజకవర్గ కేంద్రాల్లో ఆరు గ్యారెంటీల వైఫల్యంపై ధర్నాలు నిర్వహించాలి. 420 హామీల మోసాన్ని ప్రజలకు గుర్తుచేస్తూ భారీ ఫ్లెక్సీలు ప్రదర్శించడంతో పాటు, ప్రజలకు బాకీ ఉన్న హామీలను వివరిస్తూ ‘బాకీ కార్డులు’ ఇంటింటికీ పంపిణీ చేయాలని రమావత్ రవీంద్ర కుమార్ తెలిపారు.
సెప్టెంబర్ 3 – వ్యవసాయ విధ్వంసంపై రైతు సదస్సులు… అన్ని నియోజకవర్గాల్లో రైతు సదస్సులు నిర్వహించి సాగునీరు, విద్యుత్, యూరియా, రైతు బీమా తదితర సమస్యలపై రైతులతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు. హైదరాబాద్‌లో 22ఏ నిషేధిత జాబితా భూముల సమస్యపై కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 4 – మహిళలు, వికలాంగులతో ప్రత్యేక సదస్సులు… మహిళలకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతూ ప్రత్యేక సదస్సులు నిర్వహించాలి. మహిళలకు రూ.2,500 ఆర్థిక సాయం, కేసీఆర్ కిట్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని తెలిపారు. హామీలు అమలు చేయని ప్రభుత్వానికి నిరసనగా వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
సెప్టెంబర్ 5 – విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీలు…. నియోజకవర్గ కేంద్రాల్లో విద్యార్థులు, యువతతో భారీ ర్యాలీలు నిర్వహించి ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఆదిలాబాద్, సింగరేణి ప్రాంతాల్లో ప్రత్యేక నిరసన సదస్సులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 6 – నగర, గ్రామీణ సమస్యలపై నిరసనలు…. హైదరాబాద్‌లో నగర సమస్యలపై ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహించి తాగునీరు, వీధిదీపాలు, ట్రాఫిక్, శాంతిభద్రతల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం, మౌలిక వసతులు, పల్లెల సమస్యలపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
సెప్టెంబర్ 7 – ప్రజావాణి కేంద్రాల్లో వినతిపత్రాలు…. ప్రజావాణి కేంద్రాల్లో కాంగ్రెస్ హామీల వైఫల్యంపై వినతిపత్రాలు సమర్పించాలని, 420 హామీల అమలులో వైఫల్యంపై జిల్లా, మండల కేంద్రాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందజేయాలని సూచించారు.
సెప్టెంబర్ 8 – పోరుబాటపై ప్రెస్‌మీట్లు…. వారం రోజుల పాటు నిర్వహించిన పోరుబాట కార్యక్రమాలపై అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రెస్‌మీట్లు నిర్వహించి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని తెలిపారు. అనంతరం అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించాలని అన్నారు.కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల అసమర్థ పాలన, ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో వైఫల్యం, ప్రజా సమస్యలు, అవినీతి ఆరోపణలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులపై ఉందని రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.సెప్టెంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే పోరుబాటలో బీఆర్‌ఎస్‌ నాయకులు,ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన కోరారు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ప్రజల తరఫున బీఆర్‌ఎస్‌ పోరాటం కొనసాగుతుందని రమావత్ రవీంద్ర కుమార్ స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో బిఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బిల్యా నాయక్,PACS చైర్మన్ పల్లా ప్రవీణ్ రెడ్డి,మాధవరం శ్రీనివాస్ రావు,మాజీ మండలాల అధ్యక్షులు TVN రెడ్డి, వెల్లుగురి వల్లపు రెడ్డి, దొంతం చంద్రశేఖర్ రెడ్డి,రమావత్ దాస్రూ నాయక్,చింతపల్లి సుభాష్,బొడ్డు గోపాల్ గౌడ్,కేసాని లింగా రెడ్డి, ముత్యాల సర్వయ్య,రెటీనేని ముత్యపు రావు, జార్పుల లోక్య నాయక్, మునగాల అంజి రెడ్డి,మారం రవీందర్ రెడ్డి, నీల రవికుమార్, మాల్ రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, కేతావత్ రవీందర్,సర్పంచులు,కౌన్సిలర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page