సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
N. Indrasena Reddy

N. Indrasena Reddy : కూకట్పల్లి ఆగస్టు 29 త్రినేత్రం న్యూస్ : తెలుగు భాషా వికాసానికి సాంకేతికత తోడవ్వాలని, అలాగే స్వ‌చ్ఛ‌మైన తెలుగును కాపాడుకోవడం మ‌నంద‌రి బాధ్య‌త అని త్రిపుర గవర్నర్ ఎన్. ఇంద్రసేనా రెడ్డి సూచించారు. నాంప‌ల్లిలోని ఆడిటోరియంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నిర్వ‌హించిన మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కార ప్రదానోత్స‌వంలో ఆయ‌న మాట్లాడారు. ఆంధ్ర అసోసియేషన్, పూణె గౌర‌వ స‌ల‌హాదారు టి.వి. శ్రీనివాస్ కు పుర‌స్కారాన్ని అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ మాట్లాడుతూ తొలుత అంద‌రికీ తెలుగు భాషా దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు. మండలి వెంకట కృష్ణారావు త‌న‌కు అసెంబ్లీలో ప‌రిచ‌య‌మ‌ని, ఎవ‌రి గురించైనా ఎదుటి వాళ్లు చెప్పిన‌ప్పుడు చాలా గొప్ప‌గా ఉంటుంద‌ని, అటువంటి వంటి వ్య‌క్తి వెంకట కృష్ణారావు అన్నారు.
వ‌ర్సిటీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు అభినంద‌నీయం
తెలుగు యూనివ‌ర్సిటీ, తెలుగు భాష విష‌యంలో వ‌ర్సిటీ ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం సంతోష‌క‌రమ‌న్నారు. కేవ‌లం భాష మాత్ర‌మే కాకుండా, సంస్కృతీ సంప్ర‌దాయాలు, నృత్యాలు, డ‌ప్పుల కార్య‌క్ర‌మాల‌తో మిగ‌తా వ‌ర్సిటీల క‌న్నా ప్ర‌త్యేకత చాటుతోంద‌ని కొనియాడారు. గ‌తంలో ఉన్న గ‌వ‌ర్న‌ర్ నార్త్ ఈస్ట్ లో ఉన్న క‌ల్చ‌ర‌ల్ అసోసియేష‌న్ల‌ను తీసుకొచ్చి ఇక్క‌డ వాటి ఎదుగుద‌ల‌కు కృషి చేశార‌ని గుర్తు చేశారు. మిగ‌తా దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాల్లో కూడా తెలుగు భాష వ్యాప్తికి కృషి వ‌ర్సిటీ కృషి అభినంద‌నీయ‌మ‌ని తెలిపారు. అలాగే శ్రీ టి.వి. శ్రీనివాస్ కు ఈ పుర‌స్కారం అంద‌జేయ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. అయితే సాంకేతికత వినియోగంలో తెలుగు యూనివ‌ర్సిటీ ఇంకా సాధించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఇంద్ర‌సేనా రెడ్డి సూచించారు. త‌ర‌గ‌తి భోద‌న బ‌ట్టీప‌ట్టే ప‌ద్ధ‌తిలో కాకుండా, అనుభ‌వ పూర్వ‌కంగా ఉండాల‌న్నారు. ఆ దిశ‌గా వ‌ర్సిటీ ఆలోచించాల‌ని అన్నారు.ఇంగ్లిషు ప‌దాలు లేని తెలుగుపై పోటీలు
శ్రీ‌నివాస్ మాట‌ల్లో సిగ్గు, బిడియం వంటి ప‌దాలు ఉన్నాయ‌ని, వాస్త‌వానికి అవ‌న్నీత‌న‌కు వ‌ర్తిస్తాయ‌ని చ‌మ‌త్క‌రించారు. వారంతా స్ప‌ష్టంగా తాను తెలుగులో మాట్లాడ‌లేన‌ని అన్నారు. మొత్తంగా ఆయ‌న ప్ర‌సంగంలో కేవ‌లం 3 ప‌దాలు మాత్ర‌మే ఇంగ్లిషువి ఉన్నాయ‌న్నారు. అది నిజంగా గొప్ప విష‌య‌మ‌న్నారు. ఆ ర‌కంగా మాట్లాడాల‌ని పోటీలు కూడా పెట్టాల‌ని సూచించారు. వేరే భాషా ప‌దాలు రాకుండా కొన్ని నిమిషాలు మాట్లాడాల‌ని పోటీలు పెట్డడం వ‌ల్ల చాలా లాభం ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇంత స్వ‌చ్ఛంగా తెలుగు భాష మాట్లాడతారు కాబ‌ట్టే శ్రీ‌నివాస్ ఈ పుర‌స్కారానికి అర్హులు అన్నారు. త‌న‌కు భాష మీద ప్ర‌త్యేక అభిమానం ఉన్న‌ప్ప‌టికీ, స‌బ్జెక్ట్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి మిగ‌తా ప‌దాల‌న్నీ వ‌స్తాయ‌ని అన్నారు.

తెలుగుకు త‌గ్గిన‌ ప్రాముఖ్య‌త

స్వాత్రంత్యం వ‌చ్చిన త‌ర్వాత భాష సంయుక్త రాష్ట్రాలు ఏర్ప‌డితే, అంద‌రూ ఒక్క‌టిగా ఉంటార‌ని ఆలోచ‌న ఉండేద‌ని, కానీ కొన్ని భాష‌ల‌ను ఆయా రాష్ట్రాలు బ‌ల‌వంతంగా కిల్ చేశాయ‌ని తెలిపారు. ఉదాహ‌ర‌ణ‌కు ఇక్క‌డి నుంచి సూర‌త్, బొంబాయి, పుణా వెళ్లిన వాళ్లు అక్క‌డ తెలుగు పాఠ‌శాల‌లు పెట్టుకున్నార‌ని, అలాగే బ‌య‌ట నుంచి వ‌చ్చిన వాళ్లు ఇక్క‌డ ఆయా భాష‌ల పాఠ‌శాల‌లు పెట్టుకున్నార‌ని తెలిపారు. ఈరోజు అక్క‌డున్న స్కూళ‌లో త‌ప్ప‌నిస‌రిగా లోక‌ల్ భాష నేర్చుకోవాల‌న్నా ఆంక్ష‌ల‌తో తెలుగుకు ప్రాముఖ్య‌త త‌గ్గింద‌న్నారు. ఒక‌ప్పుడు మా భాష ఉండాలి, మా భాష సంస్కృతి ఉండాల‌నే ఆలోచ‌న ఉండేద‌ని, ఇప్పుడు అటువంటి ఆలోచ‌న లేద‌న్నారు.

ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం అవ‌స‌రం

విద్యార్థుల‌కు ప్రాజెక్టు ఆధారిత అభ్యాసం, కేస్ స్ట‌డీస్, ఇండ‌స్ట్రీ ఇంట‌నెన్సిప్‌, నూత‌న విద్యాబోధ‌న‌లు వంటి నూత‌న పోక‌డ‌ల‌ను తెలుగు వ‌ర్సిటీ అనుక‌రించాల‌ని సూచించారు. విద్య అంటే సాధార‌ణ డిగ్రీలా కాకుండా, అనుభ‌వ పూర్వ‌కంగా ఉండాల‌నే ఉద్దేశంతో మోదీ ప్ర‌భుత్వం నేష‌న‌ల్ ఎడ్యుకేష‌న్ పాలసీని తీసుకొచ్చింద‌న్నారు. డిజిట‌ల్ విద్య అవ‌స‌రం అని గుర్తించాల‌న్నారు. అయితే ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ చెబితే అది 100 శాతం క‌రెక్ట్ అనే ఆలోచ‌న త‌ప్పు అన్నారు. కొన్ని సార్లు సంత‌కం రాని వారికి కూడా డాక్ట‌రేట్ ఇస్తామ‌ని, అది ఆయ‌న‌కు ఉన్న ప్ర‌త్యేక‌మైన క్వాలిటీకి ల‌భించిన గుర్తింపు అన్నారు. మోదీ ప్ర‌భుత్వం వ‌చ్చాక ప‌ద్మ‌శ్రీ వంటి బిరుదుల కేటాయింపులో కూడా ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న వారికి ప్రాధాన్యం ఇస్తోంద‌ని తెలిపారు.

పుర‌స్కార గ్ర‌హీత శ్రీ‌నివాస్ మాట్లాడుతూ నేటి తరానికి, రాబోయే తరానికి తెలుగు భాషా సంస్కృతులను, వాటి మహోన్నత వైభవాన్ని పరిచయం చేస్తున్న సుర‌వ‌రం తెలుగు విశ్వవిద్యాలయానికి అభినందనలు తెలిపారు. త‌న‌ను పుర‌స్కారానికి ఎంపిక చేసినందుకు అభివాదాలు అన్నారు. త‌న‌ను తెలుగు మాధ్యమంలోనే చదివించిన త‌ల్లిద్రండుల‌కు, నాన్న‌మ్మ రుణం తీర్చుకోలేనన్నారు. త‌మ ఇంట్లో ఎప్పుడూ చక్కటి తెలుగు వాతావరణం ఉండేదని చెప్పుకొచ్చారు.

ఈ కార్య‌క్ర‌మానికి సభాధ్యక్షులుగా వ‌ర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానంద రావు వ్య‌వ‌హ‌రించారు. గౌరవ అతిథులుగా ఏపీ శాసనసభ్యులు డా. మండలి బుద్ధప్రసాద్, తెలంగాణ ప్ర‌భుత్వం పూర్వ సలహాదారులు డా. కె.వి. రమణాచారి పాల్గొన్నారు. రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంత రావు స్వాగ‌తోపాన్యాసం చేశారు. డైరెక్ట‌ర్ ఆచార్య బి. హెచ్. పద్మప్రియ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page