Trinethram News : రోడ్డు ప్రమాదాలను నియంత్రించి ప్రజల ప్రాణాలను కాపాడాలనే లక్ష్యంతో రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “అర్రైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో హెల్మెట్లు ధరించి నిర్వహించిన బైక్ ర్యాలీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ శాసనసభ్యులు భూక్యా మురళీ నాయక్, ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, జిల్లా ఎస్పీ డా. శబరీష్, పోలీస్ అధికారులు, టీఎన్‌జీవో సంఘం ప్రతినిధులు, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు, యువతతో పాటు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూక్యా మురళీ నాయక్ మాట్లాడుతూ, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, చిన్న నిర్లక్ష్యం కూడా ప్రాణ నష్టానికి దారి తీస్తుందని అన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తే ప్రమాదాలను నివారించవచ్చని సూచించారు.
అనంతరం ఎంఎల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, “అర్రైవ్ అలైవ్” కార్యక్రమం ద్వారా ప్రజల్లో అవగాహన పెరుగుతోందని, ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించినప్పుడే రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ డా. శబరీష్ మాట్లాడుతూ, గత 9 రోజులుగా జిల్లావ్యాప్తంగా “అర్రైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. రోడ్డు భద్రతపై అవగాహన ర్యాలీలు, బైక్ ర్యాలీలు, పాఠశాలలు–కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు, మార్కెట్లు, బస్టాండ్లు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు.
హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, వేగ నియంత్రణ, మద్యం సేవించి వాహనాలు నడపకపోవడం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల జరిగే మరణాలు కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి “అర్రైవ్ అలైవ్” సందేశాన్ని ఆచరణలో పెట్టాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


