Kavitha : కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 19: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన కొత్త రాజకీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారు చేశారు. మే నెల మొదటి వారంలో మంచి రోజు చూసుకుని పార్టీని అధికారికంగా ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.

పార్టీ పేరులో ‘తెలంగాణ’ అనే పదం తప్పనిసరిగా ఉంటుందని కవిత స్పష్టం చేశారు. ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తన మొదటి ఛాయిస్ సిద్దిపేట అని, రెండో ఛాయిస్ బోధన్ అని పేర్కొన్నారు.

భవిష్యత్తులో తెలంగాణలో బీజేపీ ఉండదని, ప్రధాన ప్రతిపక్షంగా తామే అవుతామని కవిత ధీమా వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తామే వస్తామని, ప్రజల సమస్యలపై పోరాటం చేస్తామని చెప్పారు. ఎంపీటీసీ, జడ్పీటీసీలతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ దారిలోనే వెళ్తోందని, కొత్త తరహా రాజకీయం చేయడం లేదని విమర్శించారు. తన పార్టీ వ్యక్తుల మీద కాకుండా వ్యవస్థల మీద నడవాలన్నారు. ప్రాంతీయ పార్టీలు లీడర్ సెంట్రిక్‌గా ఉంటాయని.. కానీ వ్యవస్థ నిర్మాణం జరగాలని,సైద్ధాంతిక పునాది ఉండాలని అన్నారు. మహిళలను అవమానించవద్దన్నారు కవిత.

వైఎస్ షర్మిలా రెడ్డి నేడు ఏపీలో ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలిగా ఉన్నారని.. కానీ, షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టడం ప్రజలకు నచ్చలేదని తెలిపారు. చిరంజీవి పార్టీ పెట్టి మూసివేయలేదా అని ప్రశ్నించారు. ‘నా లైన్‌లో నేను వెళ్తున్నా.. నా ప్రయత్నం నాది’ అని అన్నారు.

తెలంగాణ వాదమే తమ పార్టీ మొదటి లైన్ అని తేల్చిచెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కింది స్థాయి నుంచి వచ్చినవారు కేంద్ర మంత్రులు అయ్యారని చెప్పుకొచ్చారు. కొత్త తరానికి తాను పెట్టబోయే పార్టీలో అవకాశాలు ఉంటాయని కవిత పేర్కొన్నారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

kavitha is a key statement on the new party

You cannot copy content of this page

Scroll to Top